Mon Dec 23 2024 06:21:26 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ వైపు చూపు
తెలంగాణ బీజేపీ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇతర పార్టీలు ఇచ్చే హామీలను చూసి భయపడిపోతుంది
తెలంగాణ బీజేపీ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇటు హామీల విషయంలో రెండు పార్టీలూ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతుండటం... కమలం పార్టీ మాత్రం నిస్సహాయులుగా చూడాల్సి వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చినట్లు ఉచిత హామీలను ఇవ్వలేని పరిస్థితి. మ్యానిఫేస్టో కోసం కూడా ఢిల్లీ వైపు చూడాల్సిన స్థితి. రాష్ట్ర పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యర్థి పార్టీలూ ప్రజలను ఆకట్టుకునేందుకు వరస హామీలతో ముందుకు వెళుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక సంక్షేమాలను అమలు చేస్తుంది. ఎన్నికల సమయంలో మరిన్ని కీలకమైన వాగ్దానాలను ప్రకటించే అవకాశముంది.
కాంగ్రెస్ కూడా...
అదే సమయంలో కాంగ్రెస్ కూడా గ్యారెంటీ కార్డుతో ఖచ్చితంగా జనం తమను ఆదరిస్తారని హస్తం పార్టీ నమ్ముతుంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా జాతీయ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని కూడా ప్రామిస్ చేసింది. కర్ణాటక తరహాలోనే తెలంగాణాలోనూ అధికారంలోకి రావాలన్న కసితో ఆ పార్టీ అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందేలా గ్యారంటీ కార్డు రూపొందించి జనంలోకి వెళుతుంది. అందులో క్షేత్రస్థాయిలో కూడా కాంగ్రెస్ ఇటీవల కాలంలో బలంగా మారింది. టిక్కెట్ల కోసం ఆ పార్టీలో ఘర్షణలు జరుగుతున్నాయంటే దానిని బట్టే అర్థం చేసుకోవచ్చు.
ఆ జోష్ ఏదీ?
కానీ కమలం పార్టీలో మాత్రం ఆ జోష్ లేకుండా పోయింది. ఎంత సేపటికీ మోదీ ఇమేజ్, పార్టీ సిద్ధాంతాల మేరకే అది జనాలను ఆకట్టుకోవాల్సి ఉంది. జాతీయ పార్టీ కావడం, కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఇతర పార్టీలున్నంత ఫ్రీగా అది ఉండలేదు. ఆ పార్టీకి కొన్ని పరిమితులున్నాయి. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం చేయకుండా ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసినా అది నమ్మే పరిస్థితి ఉండదన్న అంచనా ఎటూ ఉంది. దీంతో పాటు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఉచితాలకు వ్యతిరేకం. ఏదైనా జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలే కాని ప్రత్యేకించి తెలంగాణ కోసం ప్రకటించే పరిస్థితి లేదు. అదే కమలం పార్టీ రాష్ట్ర శాఖ అశక్తత.
కేంద్ర పార్టీ...
అందుకే ఢిల్లీ వైపు చూడటం మినహా బీజేపీ రాష్ట్ర నేతలు మరేం చేయలేకపోతున్నారు. ఇతర పార్టీలతో పోటీపడి ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశాలు అయితే లేవు. వచ్చే ఎన్నికల్లో హామీలే ఎక్కువగా పనిచేస్తాయన్నది వాస్తవం. జనాలకు ఇప్పుడు తమకు ప్రభుత్వం నుంచి ఏరకమైన ప్రయోజనం వస్తుందని భావిస్తారు తప్పించి సిద్ధాంతాలను పోలింగ్ కేంద్రంలో పౌరులకు గుర్తుకు రావన్నది అక్షర సత్యం. అదే బీజేపీ నేతల భయం. కానీ ఫ్రీ అంటూ అనలేరు. అలాగని కాంగ్రెస్ పుంజుకుంటున్నా సహించలేరు. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో ఎలాంటి వ్యూహం అనుసరించమంటే అది చేయడం తప్ప వీరు ప్రత్యేకంగా చేయగలిగిందేమీ లేదన్నది వాస్తవం.
Next Story