Sat Dec 21 2024 02:27:40 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : డెడ్లైన్ దగ్గరపడుతుంది బాసూ... ఇక వేటాడాల్సిందేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ గడువు లోపు చాలా పనులు చేయాల్సి ఉంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ గడువు లోపు చాలా పనులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంది. అతి పెద్ద హామీ రైతు రుణమాఫీ. ఆగస్టు 15వ తేదీలోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే విపక్షాల ట్రాప్ లో పడి చేశారా? లేదా వాస్తవంగా హామీ అమలు చేస్తారో తెలియదు కానీ రేవంత్ అయితే గట్టిగానే హామీ ఇచ్చారు. ఎలాగంటే ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధమైన దేవుళ్ల మీద ఒట్టు వేసి మరీ చెప్పారు. మరి పార్లమెంటు ఎన్నికల కోసమే చేశారా? లేక నిజంగానే హామీని అమలు పర్చాలన్న నిశ్చయంతోనే చేశారా? అన్నది మాత్రం తెలియదు.
ఖాజానా పరిస్థితి...
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. రెండు లక్షల రుణ మాఫీ చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం. దీని సాధ్యాసాధ్యాల మీద అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. విడతల వారీగా చేస్తారా? లేక ఒక్కసారిగా మాఫీ చేస్తారా? అన్నది మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. అయితే రేవంత్ రెడ్డి నిన్నటి నుంచే ఆదాయం వచ్చే శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించడం కూడా ఇందులో భాగమే. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించాల్సి రావడం కూడా ప్రధానంగా ఆదాయ మార్గాలను అన్వేషించడం కోసమేనని అన్న సంగతి అందరికీ తెలిసిందే.
రుణమాఫీ చేయకుంటే...
ఆగస్టు 15వతేదీలోపు రుణమాఫీ చేయకపోతే విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు తప్పవు. జనం కూడా ఇక నమ్మలేని పరిస్థితి నెలకొంటుంది. అలా రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో తాము రైతు రుణ మాఫీ చేస్తానని ఖచ్చితంగా చెప్పడంతో రైతులు కొంత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. ఇక ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మరీ పంటలను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదిచేయాలన్నా ఖజానాలో కూడా కాసులు అవసరమే. ఇక మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని కూడా చెప్పిన హామీ అమలు కాకపోయినా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
విపక్షాల నుంచి...
ఇంకో ప్రధాన సమస్య ఇప్పటికే బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఆగష్టు సంక్షోభం ఉంటుందని చెబుతుంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తమ వైపునకు పాతిక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించడంపై కూడా రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇలా రేవంత్ కు రానున్న మూడు నెలలు గడ్డు కాలమేనని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు కావాలి. తన పట్ల ప్రజల్లో నమ్మకం పెరగాలి. నాయకుల్లోనూ తన నాయకత్వం పట్ల విశ్వాసం పెరగాలి. అలా జరగకపోతే కొన్ని రకాలైన రాజకీయ ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో రేవంత్ ఈ గండం నుంచి ఎలా బయటపడతారన్నది ఆసక్తికరంగానే మారింది.
Next Story