Mon Dec 23 2024 02:15:41 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నోటికి ప్లాస్టర్ వేసుకున్నట్లుందిగా... అసలు రహస్యం అదేనట
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎప్పుడూ స్పీడ్ గానే ఉంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వీహెచ్ ఎవరినీ వదలరు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎప్పుడూ స్పీడ్ గానే ఉంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వీహెచ్ ఎవరినీ వదలరు. వారని.. వీరని కాదు.. తరతమ బేధం లేకుండా సొంత పార్టీ నేతలపై వీహెచ్ ఫైర్ అవుతుంటారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన పార్టీలో అసంతృప్తిగానే ముద్రపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన ఆత్మగా చెప్పుకునే కేవీపీపై కూడా అప్పట్లో విమర్శలు చేసి సంచలనాలు సృష్టించారు. అలాగే మొన్నటి వరకూ అంటే పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏ పీసీసీ చీఫ్ ను ఆయన వదిలిపెట్టలేదు. చివరకు సౌమ్యుడిగా పేరున్న మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన కూడా విమర్శలు చేశారు. అంబర్ పేట్ నియోజకవర్గంలో తన అభ్యర్థికి పోటీగా ఉత్తమ్ మరొకిరిని దించుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఎవరినీ లెక్క చేయని...
అలా ఉంటది ఆయనతోటి. ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం. తనకు గాంధీ కుటుంబం అండగా ఉంటుందన్న అపార నమ్మకం. కొన్ని దశాబ్దాలుగా తాను కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉండటమే అందుకు కారణం అయి ఉండవచ్చు. అయితే ఆయన చాలా రోజుల నుంచి పదవులకు దూరంగా ఉంటున్నారు. ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్న వీహెచ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఆయన చూపు ఎప్పుడూ ఢిల్లీ వైపు చూస్తుంటుంది. అందుకే ఆయన రాష్ట్ర స్థాయి పదవుల కోసం ఎప్పుడూ పెద్దగా ఆశలు పెట్టుకోరు. అందులోనూ ఇప్పుడు తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన చూపు మళ్లీ ఢిల్లీ వైపు మళ్లిందంటున్నారు.
గత నెల రోజుల నుంచి...
అయితే గత నెల రోజుల నుంచి వి.హనుమంతరావు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నోరు అదుపులో పెట్టుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం త్వరలో రాజ్యసభ పదవులు భర్తీ అవుతుండటమే. బీసీ కోటాలో మాత్రమే కాకుండా తనను సీనియర్ నేతగా పెద్దల సభకు పంపుతారన్న ఆశతో ఆయన ఉన్నారు. అందుకోసమే ఎవరి పైనా విమర్శలు చేయడం లేదు. అధికారం వచ్చింది కదా? అని ఊగిపోవడం లేదు. చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ఇదంతా వీహెచ్ చాలా రోజుల తర్వాత లభించే అవకాశమున్న రాజ్యసభ పదవి కోసమేనని ఆయన సన్నిహితులు కూడా అంగీకరిస్తున్నారు.
రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే...
అందునా రేవంత్ రెడ్డి లాంటి వాళ్లతో పెట్టుకుంటే అసలుకే ఎసరు వస్తుందని భావించిన వీహెచ్ ఏ మాత్రం తొందరపడకుండా పదవి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. చిట్ట చివరిసారిగా ఆయన 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు ఇప్పటికే ఆయనకు పార్టీ రాజ్యసభ పదవి ఇచ్చింది. అయితే నాలుగోసారి ఇచ్చేందుకు తనకు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదన్న ఆలోచనతోనే ఆయన మౌనంగా ఉంటున్నారు. నోటికి ప్లాస్టర్ వేసుకుని మరీ పెద్దల సభలో కాలుపెట్టేందుకు వెయిట్ చేస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డిని ఆయన నమ్ముకున్నట్లు కనపడుతుంది. మరి పెద్దాయన స్కెచ్ ఫలించి రేవంత్ రెడ్డి సిఫార్సుతో నాలుగోసారి రాజ్యసభకు వీహెచ్ వెళతారా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
Next Story