Sat Nov 23 2024 12:26:59 GMT+0000 (Coordinated Universal Time)
గెలుపు గుర్రాలు వీరేనట... గులాబీ పార్టీని ఢీకొనేది ఇలా
తెలంగాణ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది
తెలంగాణ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. మ్యానిఫేస్టోలను రూపొందించి జనంలోకి వెళ్లడానికి సిద్ధమయ్యాయి. సంక్షేమ పథకాలను ప్రకటించి అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌కు కొంత ఊపు కనిపిస్తుంది. ఇదే ఊపును మరో మూడు నెలలు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ అయితే కాంగ్రెస్ పార్టీ రేసులో ముందు ఉన్నట్లే చూడాల్సి ఉంటుంది. సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్నాయి. నేతలు కూడా ఐక్యంగా ముందుకు కదులుతుండటం కొంత ఆరోగ్య పరిణామమే.
టిక్కెట్ దక్కకుంటే...
కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. తమ అభిప్రాయాలను పార్టీ సమావేశాల్లో కాకుండా బాహాటంగానే చెబుతుండటం ఒక్క కాంగ్రెస్‌కే చెల్లుతుంది. టిక్కెట్ దక్కకుంటే చాలు ఇక మైకుల ముందు ఒకటే హోరు. నేరుగా హైకమాండ్‌తో పోరుకు సిద్ధమవుతారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫస్ట్ లిస్ట్ ను కూడా ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ కూడా భావిస్తుంది. స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే తుది జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడి టిక్కెట్లను ఖరారు చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రత్యర్థిని బట్టి...
మరోవైపు సునీల్ కనుగోలు తన సర్వే నివేదికలను కూడా హైకమాండ్‌కు ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరోసారి లేటెస్ట్గా సర్వే చేయించి గెలుపు గుర్రాల జాబితాను రూపొందించారని తెలుస్తోంది. సామాజికవర్గాల ఆధారంగా కూడా ఈ జాబితాను సిద్ధం చేశారు. ఈసారి ఎన్నికల్లో ధనం ప్రధానంగా మారడంతో ఆర్థిక స్థోమత ఉన్న వారినే ఎంపిక చేస్తారన్న సమాచారం కూడా ఉంది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల నుంచి అధికారంలో ఉండటంతో ఈసారి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారన్న అంచనాలతో ఆ దిశగా కూడా అభ్యర్థుల ఎంపిక జరగనుందని చెబుతున్నారు. ఆర్థిక, అంగ, సామాజికవర్గాల వారీగా ఫిల్టర్ చేసి మరీ అభ్యర్థులను సెలెక్ట్ చేశారంటున్నారు.
క్లాస్ పీకుతున్న...
అయితే టిక్కెట్లను ప్రకటించిన తర్వాత కూడా ఇదే ఐక్యతను కొనసాగించాలన్నది పార్టీ క్యాడర్ ఆశిస్తుంది. ఐక్యంగా ముందుకు వెళితే కేసీఆర్‌పై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హైకమాండ్ కూడా ఈ మేరకు నేతలందరీని ఒక్కొక్కరినీ పిలిచి మాట్లాడుతూ వారికి క్లాస్ పీకుతుంది. రేణుకా చౌదరిని కూడా ఢిల్లీకి పిలవడం ఇందుకేనంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. టిక్కెట్లు ప్రకటించే ముందుగానే నేతలకు హైకమాండ్ అన్నీ చెప్పి పంపుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి గెలవకుంటే కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్ ఉండదని భావించిన నేతలు కూడా తమకు అనుకూలంగా నిర్ణయాలు రాకపోయినా సర్దుకుపోవాలని చెప్పే ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
Next Story