Fri Nov 22 2024 19:35:28 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తెలంగాణాలో చూసి ఇక్కడ నిర్ణయం.. చంద్రబాబు నయా ప్లాన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబరు మరికొద్ది రోజుల్లో తిరిగి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబరు మరికొద్ది రోజుల్లో తిరిగి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి 52 రోజుల పాటు జైలులో ఉండి వచ్చిన చంద్రబాబు కంటికి చికిత్స చేయించుకుని హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఆయన తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని విజయవాడకు వచ్చారు. రాజకీయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు నెలల నుంచి చంద్రబాబు కేసుల కారణంగా పార్టీలో ఒకరకమైన స్తబ్దత నెలకొంది. జైలుకు వెళ్లకపోతే ఇప్పటికే అన్ని ప్రాంతాలను ఒకసారి చుట్టి వచ్చేవారు. అలాంటిది కేసుల కారణంగా ఆయన మూడు నెలల సమయాన్ని రాజకీయంగా కోల్పోవాల్సి వచ్చింది. ఆయన వరసగా జిల్లాల పర్యటనకు కూడా నడుంబిగించారు.
తెలంగాణ ఫలితాలను బట్టి...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. అందుకే ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబరు 3వ తేదీన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అక్కడ బీఆర్ఎస్ వస్తే ఒకలా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరోలా నిర్ణయం ఉండేలా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నాయి. అక్కడ పోటీ చేయకుండా పరోక్షంగా ఓటు బ్యాంకును కాంగ్రెస్ కు తరలించారన్న టాక్ కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానితో నేరుగా పొత్తు పెట్టుకోవడానికి అయినా సిద్ధపడే అవకాశాలున్నాయి. ఎందుకంటే అందుకు చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. ఒకటి ఏపీలో బీజేపీ కంటే కాంగ్రెస్ పట్ల తక్కువ వ్యతిరేకత ఉండటం ఒక కారణం కాగా, పొరుగు రాష్ట్రం నుంచి సహకారం కూడా లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువ మంది ఏపీకి చెందిన ఓటర్లు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు తనకు కలసి వస్తుందని నమ్ముతున్నారు.
కాంగ్రెస్ తో పొత్తు వల్ల...
మరొక కీలకమైన కారణం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ బలమైన నేతలున్నారు. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేని వారు ఉన్నారు. సామాజికవర్గం పరంగా కూడా పేరున్న నేతలున్నారు. అదీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా పెద్దగా కోరుకోకపోతే కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలను అధికంగా ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్ధపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. విభజన జరిగి పదేళ్లు కావడంతో రాష్ట్రాన్ని విభజించారన్న ఆగ్రహం కాంగ్రెస్ పై ప్రజల్లో క్రమంగా తొలిగిపోయిందన్న అంచనాలో టీడీపీ అధినేత ఉన్నట్లు తెలిసింది. ఏ రకంగా చూసినా బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అని ఆయన భావిస్తుండటం ఈ రెండింటికి కారణం. ప్రధానంగా దళిత, ముస్లిం ఓటర్లు తమకు మద్దతు తెలిపే అవకాశాలు కూడా లేకపోలేదన్న అభిప్రాయంలో పెద్దాయన ఉన్నారు. పవన్ కూడా వదిలించుకునే ఆలోచనలోనే ఉన్నారు. బీజేపీ కలిసి వస్తే సరి. లేకుంటే దానిని వదిలేసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
పవన్ ను పక్కన పెట్టైనా....
ఇక పవన్ కల్యాణ్ విషయం అంటారా? అవసరమైతే పవన్ కల్యాణ్ కు కూడా ఝలక్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్ తో కలసి వెళ్దామని తొలుత బుజ్జగింపులు చేస్తారు. లేకుంటే వదులుకోవడానికైనా వెనుకాడరు. పవన్ కు అన్ని సీట్లు ఇచ్చి పార్టీ నేతల్లో అసంతృప్తిని తట్టుకోలేమన్న ఆలోచన కూడా ఈ దారి వెతుక్కునేలా చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ తో పొత్తు అయితే ఇరవైకి పైగా స్థానాలను ఇవ్వాల్సి ఉంటుందని, కాంగ్రెస్ అన్ని స్థానాలు ఆశించదని, అప్పుడు సీట్ల కేటాయింపు సులువవుతుందని నమ్ముతున్నారు. పవన్ తో పొత్తు అధికారికంగా ఖరారయినప్పటికీ సీట్ల విషయంలో కిరికిరి పెట్టి వదిలించుకుంటారన్న టాక్ వినపడుతుంది. అయితే చెప్పలేం. తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టి మాత్రమే అక్కడ నిర్ణయం ఉంటుంది. బీఆర్ఎస్ తెలంగాణలో గెలిస్తే పవన్ తో నే ప్రయాణం సాగించే వీలుంది. బీజేపీని కూడా కలుపుకునే ప్రయత్నం ఆయన చివర వరకూ చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Next Story