Sun Dec 22 2024 21:49:14 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో కొత్త పార్టీ దిశగా ఇద్దరు కీలక నేతల అడుగులు ?
ఇద్దరి లక్ష్యం ఒకటే కావడం వల్ల ఇద్దరం కలిసి నడుద్దాం అని సూచనాప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో
కేసీఆర్‌ను గద్దె దింపడమే వారిద్దరి లక్ష్యం. అయితే, అది ఏ పార్టీతో సాధ్యమనేది మాత్రం ఎంతకీ తెల్చుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది కాబట్టి ఆ పార్టీలోకి వెళదామని ఒకసారి అనుకుంటారు. అంతలోనే కాంగ్రెస్ బలాలను గుర్తుచేసుకొని కాంగ్రెస్ అయితేనే మంచిదేమో అని అంచనా వేసుకుంటారు. ఇలా అనేక ఆలోచనలతో గత మూడేళ్లుగా తమ రాజకీయ గమ్యం ఏటు వైపో తేల్చుకోలేక డైలమాలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు ఒక్కటవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంతకాలం వీరికి బీజేపీ లేదా కాంగ్రెస్ అనే రెండు ఆప్షన్లే ఉండేవి. ఇప్పుడు మాత్రం కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందనే సరికొత్త ఆలోచన చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నా ఆయన ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండటం లేదు. దాదాపుగా ఆయన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీలో నిర్వహించిన కీలక నేతల సమావేశానికి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం ఉన్నా వెళ్లలేదు. తాజాగా వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు కూడా హాజరుకాలేదు.
ఈ రెండు చర్యల ద్వారా ఒక తాను కాంగ్రెస్‌కు రాం.. రాం చెప్పబోతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టమైన సిగ్నల్స్ ఇచ్చేశారు. బీజేపీ, టీఆర్ఎస్తో టచ్‌లో ఉన్న వారు ఆ పార్టీల్లోకి వెళ్లొచ్చని రాహుల్ గాంధీ కూడా చెప్పడంతో ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీ నుంచి ఆయనకు చాలా రోజులుగా ఆహ్వానం ఉంది. కాకపోతే, తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటానని చెబుతున్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఏటూ తేల్చుకోలేకపోయారు.
ఇక, కాంగ్రెస్‌ను ఇప్పటికే వీడిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఆయనకు కూడా అటు బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం ఉంది. అయితే, కేసీఆర్‌ను ఢీకొట్టి గద్దె దింపే సత్తా ఏ పార్టీకి ఉందనేది ఆయన తేల్చుకోలేకపోతున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి వచ్చారు. బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్‌తో టచ్‌లో ఉంటున్నారు. దీంతో ఈ నెల 14న అమిత్ షా సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరబోతున్నారనేది దాదాపుగా ఖాయమైందనే ప్రచారం జరిగింది.
ఇంతలోనే కాంగ్రెస్ అసమ్మతి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కొండా భేటీ అయ్యారు. ఇద్దరి లక్ష్యం ఒకటే కావడం వల్ల ఇద్దరం కలిసి నడుద్దాం అని సూచనాప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నందున ఆ పార్టీలోకి వెళితే ఎలా ఉంటుందని వారు చర్చించుకున్నారు. అయితే, జాతీయ ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెట్టి పని చేసే కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ను ఎంతవరకు ఓడించగవు అనే అనుమానం ఈ ఇద్దరిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే, తెలంగాణ సెంటిమెంట్‌తోనే పనిచేసేలా ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దిశగా వీరు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా రోజుల నుంచే ప్రాంతీయ పార్టీ ఏర్పాటుచేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. కాకపోతే, తానొక్కడి వల్ల అవుతుందా అనే భావన ఆయనలో ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి లాంటి కలిసివచ్చే నేతలతో కలిసి ఒక పార్టీని స్థాపిస్తే బాగుంటుందనే దిశగా ఆయన ఆలోచనలు ఉన్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ విషయంపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు ఉంటాయని రాజగోపాల్ రెడ్డితో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పడంతో వీరు అడుగులు ఎటువైపనే ఆసక్తి నెలకొంది.
Next Story