Mon Dec 23 2024 15:14:46 GMT+0000 (Coordinated Universal Time)
Konathala Ramakrishna : కొణతాల వెళ్లాలనుకుంటున్న పార్టీ అదేనా... కానీ రానిస్తారా?
ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ అంటేనే క్యాస్ట్ అండ్ క్యాష్ పాలిటిక్స్. ఇందులో ఎలాంటి విభేదాలకు తావులేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. కులం లేనిదే.. ఓట్లు పడవు. కాసులు లేనిదే ఓట్లు రాలవు. ఇదీ ఏపీ పాలిటిక్స్ లో ప్రధాన సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను నిర్ణయిస్తుంటాయి. కాసులు, కులం బలం ఉన్న నేత వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటాయి. ఆయన కులానికి ఎంత బలం ఉందీ? ఆయన ఎంత ఖర్చు చేయగలడన్న లెక్కలే టిక్కెట్లు తెచ్చి పెడతాయి. రిజర్వడ్ నియోజకవర్గాలకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చే పార్టీలు జనరల్ కేటగిరీలో ఎంపిక చేసే అభ్యర్థులను ఈ విధంగానే బరిలోకి దింపుతుంటాయి. వారయితేనే గెలుపు కోసం తాము పెద్దగా కష్టపడక్కరలేదన్న భావన కారణంగానే ఈ రకమైన ఎంపిక కొన్నాళ్లుగా.. కాదు.. కాదు.. కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది.
ప్రజల్లో బలం ఉన్నా...
ఇక అవుట్ డేటెెడ్ నేతలను అస్సలు పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? లేదా? అన్నది కూడా కొంత ఆలోచించాల్సిన అంశమే. ప్రజాబలం ఉన్న నేతలను కూడా ఈ తరం రాజకీయాల్లో నెట్టుకురావడం కష్టంగానే చెప్పాలి. దశాబ్దం కాలం నాటి రాజకీయం వేరు. నేటి పాలిటిక్స్ వేరు. అన్ని రకాలుగా ఆరితేరి ఉండాలి. ప్రజల్లో బలం ఉన్నా.. నీతి నిజాయితీలంటూ నిగ్గుతీసుకుని కూర్చుని ఉన్నా ఫలితం లేదు. పార్టీ అగ్రనాయకత్వం పెద్దగా వారిని పట్టించుకోరు. అందుకే చాలా మంది నేతలు ఇప్పటికే రాజకీయాలకు దూరమయిపోయారు. తాము ఈ నాటి రాజకీయాలు చేయలేమని కొందరు చేతులెత్తేయగా, మరికొందరు మాత్రం అవకాశం తమ ఇంటి తలుపు తడితే చూద్దాంలే అనుకుని వెయిట్ చేసే వాళ్లు మరికొందరు.
చివరి నిమిషం వరకూ...
అలాంటి రెండో రకానికి చెందిన నేతే కొణతాల రామకృష్ణ. ఎలాంటి అవినీతి మచ్చ లేదు. కుల బలం పుష్కలంగా ఉంది. అదే ఆయనకు ప్లస్ పాయింట్. మరోవైపు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా ప్రత్యర్థితో పోటీ పడి ఎన్నికల్లో ఖర్చు చేయలేని పరిస్థితి కొణతాల రామకృష్ణకు ఉందంటారు. అది ఆయనకు డిజట్వాంజీ. ఒక్క నిర్ణయంతో ఆయన రాజకీయ జీవితం మారిపోయింది. ప్రతిసారీ ఎన్నికలు సమీపించిన సమయంలో ఆయన పేరు బాగా వినపడుతుంది. పార్టీలన్నీ ఆయన వైపు చూస్తాయి. కానీ ఆయనకు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్నది చివరి వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి. కొణతాల రామకృష్ణ ఆషామాషీ నేతకాదు. మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా, ఒకసారి మంత్రిగా పనిచేసి ప్రజల్లో పేరున్న నేత. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన కొణతాల కొంత కాలం బాగానే ఉన్నా తర్వాత ఎందుకో విభేదించి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన పొలిటికల్ రేస్ లో మాత్రం పరుగులు తీయలేకపోతున్నారు.
పదేళ్ల నుంచి...
వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొణతాల రామకృష్ణ పదేళ్ల నుంచి పదవులు లేకుండా ఖాళీగానే ఉంటున్నారు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారం ఇప్పుడే కాదు. 2019 ఎన్నికల సమయంలోనూ జరిగింది. కానీ కొణతాలకు ఆ ఛాన్స్ పార్టీ ఇవ్వలేదా? తానే తీసుకోలేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకకపోయినా ఆయన మాత్రం టీడీపీలో చేరలేదు. ఉత్తరాంధ్ర సమస్యలపై కొద్దికాలం గళం వినిపించిన కొణతాల రామకృష్ణ గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకుంటే గవర సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా వచ్చి పడతాయన్నది పార్టీ నేతల విశ్లేషణలు. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన అనేక మంది నేతలు రాజకీయంగా ఎదిగి రావడంతో కొణతాలను టీడీపీ కూడా గత ఎన్నికల్లో లైట్ గా తీసుకుందంటారు.
మరోసారి ప్రచారంలోకి...
అయితే మరోసారి ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితం సాఫీగా సాగినా ఆ తర్వాత మాత్రం కొణతాల పాలిటిక్స్ పెద్దగా ఫలించలేదు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు సభ్యుల కొరత ఉంది. దీంతో కొణతాలకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతో పార్టీ నాయకత్వం ఉందని చెబుతున్నారు. కొణతాల మాత్రం ఇప్పటికీ ఏ పార్టీతో సఖ్యతగా లేరు. ఎన్నికల సమీపంలో ఆయన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. ఆయన టీడీపీలో చేరితే ఆయనకు లాభం ఎంత అనేది పక్కన పెడితే పార్టీకి మాత్రం కొంత హైప్ వస్తుందన్నది వాస్తవం. జనసేన కూడా పొత్తు ఉండటంతో గెలుపు గ్యారంటీ అని భావిస్తున్నారు. మరి చివరి వరకూ తన చేరికపైన నిర్ణయాన్ని కొణతాల రామకృష్ణ సాగదీస్తారా? ముందుగా చేరి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story