Mon Nov 18 2024 13:40:45 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : దెందులూరు సభ పునరాలోచనలో పడేసిందా? ఆరో జాబితా ఆలస్యమవుతుందా?
వైసీపీ ఆరో జాబితా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దెందులూరు సభకు ముగ్గురు ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు
వైఎస్ జగన్ ఈసారి అధికారంలోకి రావడానికి అభ్యర్థులను మారుస్తున్నారు. నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జులను నియమిస్తున్నారు. దీంతో పార్టీలో అలజడి మొదలయింది. ఇప్పటి వరకూ వైసీపీలో ఐదు జాబితాలు విడుదలయ్యాయి. ఈ ఐదు జాబితాల్లో పదమూడు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ, అరవై వరకూ శాననసభ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులను మార్చారు. అంటే 175 స్థానాల్లో ఇప్పటి వరకూ మూడో వంతు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. ఎమ్మెల్యేలను ఎంపీీలుగా, మంత్రులను మరొకచోటికి, ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్చడమే కాకుండా కొందరిని పూర్తిగా దూరం పెట్టేశారు. అంటే వారికి ఎక్కడా టిక్కెట్ ఇవ్వలేదు. ఇలాంటి వారి సంఖ్య ఇరవైకి పైగానే ఉంది.
కొందరు రాజీనామా చేయగా...
ఇప్పటికే తమకు టిక్కెట్ రాదని తెలిసి నలుగురు పార్లమెంటు సభ్యులతో పాటు ఐదురుగు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. కొందరు టీడీపీ అగ్రనేతలను కలసి తమకు అదే స్థానంలో టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. విశాఖ సిద్ధం సభ సక్సెస్ అయింది. ఉత్తరాంధ్రలో మార్పులు, చేర్పులు చేపట్టినా పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ మిగిలిన ప్రాంతాల్లో మాత్రం అసంతృప్తిని నేరుగానే వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళుతున్నారు. రాయలసీమ ప్రాంతాల్లోనూ కొందరు నేతలు పార్టీకి దూరమవుతారన్న వార్తలు అధినాయకత్వాన్ని ఆలోచనలో పడేశాయని చెప్పాలి. ఆరో జాబితా విషయంలో కొంత గ్యాప్ ఇవ్వాలని భావిస్తున్నట్లుంది.
నాలుగు ప్రాంతాల్లో...
భీమిలీలో జరిగిన సిద్ధం లాంటి సభలనే నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పెద్దయెత్తున సభలు ఏర్పాటు చేసి జగన్ క్యాడర్‌కు తాము ఏ పరిస్థితులలో మార్చామో చెప్పేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా రేపు ఏలూరు జిల్లా దెందులూరు సభలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సభకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆదేశించింది. అయితే దెందులూరు సభ దెబ్బకొట్టేలా కనిపిస్తుంది. ఆ సభకు టిక్కెట్ రాని, తమకు దక్కదని భావించిన ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఆరో జాబితాను వాయిదా వేసుకోవాలని అధినాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.
దూరంగా ముగ్గురు ఎమ్మెల్యేలు...
రేపు జరిగే దెందులూరు సభకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ ముగ్గురు పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ వీరిలో ఇద్దరికి సీట్లు మాత్ర రావని తేలిపోయింది. మైలవరంలో మార్పు ఉంటుందని సంకేతాలు అందడంతో వసంత కూడా అసంతృప్తితో ఉన్నారు. వీరు ముగ్గురు దెందులూరు సభకు దూరంగా ఉండటమే కాకుండా తమ అనుచరులకు కూడా ఆ సభకు వెళ్లవద్దని ఫోన్ చేసి చెబుతుండటంతో వైసీపీ క్యాడర్ లో కొంత అయోమయం నెలకొంది. ఇలా సిద్ధం సభలకు ఎమ్మెల్యేలు హాజరు కాకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన అధినాయకత్వం ఆరో జాబితాకు కొంత గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక కోస్తాంధ్ర, రాయలసీమల్లో సిద్ధం సభలు పూర్తయ్యే వరకూ ఆరోజాబితా వచ్చే అవకాశం లేదంటున్నారు.
Next Story