Sun Dec 22 2024 10:00:36 GMT+0000 (Coordinated Universal Time)
BRS : పేరు మార్పిడి కొంపముంచింది.. కేసీఆర్ చేజేతులా చేసుకున్నదే
బీఆర్ఎస్ తెలంగాణలో ఓటమికి అనేక కారణాలున్నాయి. అందులో పేరు మార్పు కూడా ఒకటి
బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు.. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు... బీఆర్ఎస్ ఓటమికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు. అందులో ఒకటి పేరు మార్చడం కూడా బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోకపోవడానికి కారణంగా కనపడుతుంది. అసలు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అలాంటి టీఆర్ఎస్ ను కేసీఆర్ ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా తనకు తానుగా ప్రకటించుకున్నారు. అంటే తాను తెలంగాణ నుంచి తప్పుకోకపోయినా.. జనం మనసులో మాత్రం ఆయన ఆ అభిప్రాయాన్ని పేరు మార్పిడి ద్వారా సృష్టించగలరు.
ఇంటి పార్టీగా....
టీఆర్ఎస్ అంటే నే ఇంటి పార్టీ అని అందరూ భావించారు. కానీ కేసీఆర్ చేజేతులా ఎన్నికలకు ముందు ఆయన ఆ సెంటిమెంట్ ను ఆయనే కాలరాశారనుకోవాలి. బహుశ ఈసారి పేరు మారిస్తే విజయం లభిస్తుందని ఎవరైనా పండితులు సూచించి ఉండి ఉంటే చెప్పలేం కానీ.. కేసీఆర్ బీఆర్ఎస్ గా పేరు మార్చడం ఆ పార్టీ నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ ఎవరకీ ఇష్టం లేదు. అంతా ఆయన ఇష్టం కాబట్టి ... అధికారంలో ఉన్నారు కాబట్టి పైకి చెప్పలేకపోయారు కానీ పేరు మార్పిడి అనేది ఈ ఎన్నికల్లో పెద్ద ప్రభావమే చూపింది. ప్రధానంగా ఇప్పటికీ టీఆర్ఎస్ గానే పిలుచుకునే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అంటేనే ఒక రకమైన ఏహ్యభావం ఓటర్లలో కనిపించింది.
అసంతృప్తి అందుకే...
బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశమంతా తిరిగి హడావిడి చేయడంతో పాటు ఉత్తర భారతదేశంలోని రైతులకు కూడా తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ పంచి పెట్టారన్నది జనంలో గూడు కట్టుకున్న విషయాన్ని ఈ ఎన్నికల్లో స్పష్టమయింది. వరసగా రెండుసార్లు గెలవడం కొన్ని వర్గాల్లో అసంతృప్తిని నింపగా, ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పేరు మార్పిడిని సహించలేకపోయారు. తెలంగాణ సాధించిన తర్వాత అభివృద్ధి జరిగినా ఉపాధి కల్పనలో విఫలమవ్వడంలో యువత చాలా అసంతృప్తిలో ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పదేళ్లుగా నిర్వహించకపోవడం వల్ల ఒక తరం యువత తమ అవకాశాలను కోల్పోయిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
జాతీయ రాజకీయాల్లో...
అందుకే కేసీఆర్ చేజేతులా అవకాశాన్ని కాంగ్రెస్ కు ముందుగానే అధికారాన్ని అప్పగించేలా తన నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకు పేరును మార్చాల్సి వచ్చిందో? ఆయనే చెప్పాల్సి ఉంటుంది. దేశంలో బలమైన జాతీయ పార్టీలను కాదని ఇక్కడి నుంచి వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలకం కావచ్చు. దానికి పేరు మార్చాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి దాని ఫేట్ ను కూడా మర్చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీనికి అంతటికీ కారణం కేసీఆర్ కారణమని చెప్పక తప్పదు. ఆయన అనుసరించి పోకడలను ప్రజలు ఈసారి మాత్రం స్వాగతించలేకపోయారన్నది సుస్పష్టం.
Next Story