Mon Dec 23 2024 08:57:19 GMT+0000 (Coordinated Universal Time)
BRS : ఆఖరికి కడియం కూడా.. ఇప్పటికైనా కేసీఆర్ కు తెలుస్తుందో లేదో?
బీఆర్ఎస్ కు కడియం శ్రీహరి కుటుంబం కూడా గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నమ్మకమైన నేతలే పార్టీని వీడుతున్నారు
బీఆర్ఎస్ కు వరస షాక్లు తగులులున్నాయి. తాను నమ్మి పదవులు ఇచ్చిన వారే తనను వీడి వెళ్లిపోతున్నారు. ఉద్యమంలో తన వెంట లేకపోయినా వివిధ సమీకరణాలతో వారిని దగ్గరకు తీసుకుని అందలం ఎక్కిస్తే అధికారానికి దూరం కాగానే వారు వెళ్లిపోతున్నారు. ఎవరు తన వాళ్లో.. ఎవరు పరాయి వాళ్లో అన్న విషయం కేసీఆర్ కు అర్థమయ్యే లోపే కారు పార్టీ ఖాళీ అయ్యేటట్లు కనిపిస్తుంది. నిన్న కేశవరరావుతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పార్టీకి దూరమవుతారని ప్రకటించిన తర్వాత తాజాగా కడియం ఫ్యామిలీ కూడా దుకాణాన్ని సర్దేసింది. కడియం కావ్య తాను వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇంత చేసినా...
ీఈ మేరకు కేసీఆర్ కు లేఖ రాశారు. కడియం శ్రీహరిని గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీ చేయించారు. అప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. అసలు కడియం శ్రీహరి టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వెంటనే ఆయనకు 2014లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంతటితో ఆగలేదు. అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించి శ్రీహరిని కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం ను చేశారు. మరోసారి ఎమ్మెల్సీ పదవిని కూడా రెన్యువల్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో మరోసారి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు.
లేఖరాసి...
పైగా కడియం కావ్య రాసిన లేఖ కూడా మరొక సంచలనానికి దారి తీసింది. బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలతో పాటు భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతోనే తాము కాంగ్రెస్ ను వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి నష్టం జరుగుతుందని కూడా తెలిపారు. అందుకే తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు కావ్య తెలిపారు. పార్టీలో ఎవరూ తమకు సహకరించడం లేదని, నాయకత్వంపై వస్తున్న ఆరోపణలను కలచి చేసి తాము ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. అంతేకాదు.. తండ్రితో కలసి ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.
కడియం కూడానా?
ఆయన కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టిక్కెట్ ను ఇటీవలే కేటాయించారు. అయితే ఆమె తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరొకటి ఏంటంటే .. మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కడియం శ్రీహరి త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమయ్యారు. మరి ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎలా చేర్చుకుంటుందన్నది పార్టీ శ్రేణులకే బోధపడటం లేదు. అసలు కడియం కుటుంబాన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ పార్టీ వరంగల్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Next Story