Mon Dec 23 2024 08:46:37 GMT+0000 (Coordinated Universal Time)
Vangaveeti : ఏంటో పాపం... ఎప్పుడూ ఆయన అధికార పార్టీలో ఉండరు.. అందుకే ప్రయారిటీ లేదా?
వంగవీటి రాధా మరోసారి పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుంది. వైసీపీలోకి వస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు
వంగవీటి అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక ఫైర్బ్రాండ్. వంగవీటి రంగా పేరు ఇప్పటికీ గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకూ మారుమోగుతుంటుంది. వంగవీటి రాధా హత్య జరిగి దశాబ్దాలు దాటుతున్నా ఆయన ఇమేజ్ మాత్రం ఇంచ్ కూడా తగ్గలేదంటే ఆయనపట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఒక ఉదాహరణ మాత్రమే. ప్రధానంగా కాపు సామాజికవర్గం నుంచే కాకుండా పేదలు కూడా వంగవీటి రంగాను తమ అభిమాన నేతగా గుర్తిస్తారు. ఆయన అతి తక్కువ కాలం ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది మనసును దోచుకున్నారు. వంగవీటి నేమ్ బ్రాండ్ తో ఇప్పటికీ అనేక మంది పదవులు పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. రంగా అనుచరుల మని చెప్పుకుంటున్న వారు కూడా ఉన్నత స్థాయికి ఎదిగారు.
పోటీ చేసేందుకు కూడా...
కానీ అదేంటో పాపం.. ఆయన కుమారుడు వంగవీటి రాధా మాత్రం రాజకీయాల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి వంగవీటి రాధా హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. అందుకు కారణాలు అనేకం. వంగవీటి రాధా రాజకీయ ప్రయాణంపై మరోసారి చర్చ మొదలయింది. టీడీపీతో జనసేన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత వంగవీటి రాధాను టీడీపీ నిర్లక్ష్యం చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయనను మరోసారి వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెబుతున్నారు. అదే జరిగితే వంగవీటి రాధా ఈసారి పోటీ చేసే సీటు విషయంలోనూ స్పష్టత వస్తుందని రాధా అనుచరులు చెబుతున్నారు.
ఎన్ని సార్లు...?
2004లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాధా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయన అధికార పార్టీలో ఉండటం. ఆ తర్వాత వంగవీటి రాధా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమిపాలయ్యారు. ఇక అప్పటి నుంచి రాధా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆ ఇంటి పేరుకు ఉన్న బ్రాండ్ కూడా ఆయనను ఏ రకంగానూ రాజకీయంగా ఎదగనివ్వలేకపోయింది ప్రజారాజ్యం నుంచి తర్వాత 2014లో వైసీపీలో చేరారు. అప్పుడూ ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి మరోసారి ఫ్లాగ్ ను మార్చేశారు. అయితే గత ఎన్నికల్లో వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించలేదు. అధికారంలోకి వస్తే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో వంగవీటి రాధా చట్టసభలకు దూరంగానే ఉన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలోనూ రాధా పాల్గొన్నారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
టీడీపీలో ఉన్నా...
ఇప్పుడు మరోసారి వంగవీటి రాధా టీడీపీలో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఆయనను పట్టించుకోకపోవడంతో వైసీపీ తిరిగి రాధాను చేర్చుకుంటుందన్న ప్రచారం జరుగుతుంది. ఇందుకు ఆయన ప్రియమిత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. వైసీపీలో చేరితే వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టిక్కెట్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. అక్కడ మల్లాది విష్ణును పక్కన పెట్టి రాధాకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేందుకు వైసీీపీ అధినాయకత్వం కూడా రెడీ అయిపోయిందట. అయితే వంగవీటి రాధా టీడీపీలో ఉంటే విజయవాడ సెంట్రల్ సీటు దక్కడం కష్టం. అక్కడ బొండా ఉమామహేశ్వరరావు ఆల్రెడీ కర్చీఫ్ వేసి కూర్చున్నారు. దీంతో వంగవీటి రాధా మరోసారి పార్టీ మారతారన్న ప్రచారం బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story