Mon Dec 23 2024 05:42:41 GMT+0000 (Coordinated Universal Time)
రాంగ్ స్టెప్ వేసి.. వెనక్కు తీసుకోలేనంతగా
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజకీయాలు అస్సలు అచ్చిరాలేదనే చెప్పాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా వైఎస్ షర్మిలకు రాజకీయాలు అస్సలు అచ్చిరాలేదనే చెప్పాలి. ఏపీలో తన అన్నను కాదని తెలంగాణలో పార్టీ పెట్టడమే షర్మిల చేసిన అది పెద్దతప్పు అని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. అన్నతో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే ఏదో ఒక రకంగా రాజకీయ పదవి లభించేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల చేతులు కాల్చుకున్నట్లయిందని అనే వారు ఎక్కువగా కనపడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారంతా షర్మిల రాజకీయంగా వేసిన తప్పటడుగులు గురించి చర్చించుకుంటున్నారు.రాజకీయంగా బలమైన కుటుంబం నుంచి వచ్చిన షర్మిల చివరకు నామమాత్రంగా మిగిలిపోతుండటం జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్టీ పెట్టి...
ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని పెట్టారు. అంతవరకూ బాగానే ఉంది. వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కూడా చేశారు. పాలేరు నియోజవర్గంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పాలేరులో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. వైఎస్ ను అభిమానించే అనేక మంది షర్మిల వెంట నడిచారు. కొందరు బయటకు రాకపోయినా పరోక్షంగా షర్మిలకు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె వేసిన ఒకే ఒక స్టెప్ మొత్తం సీన్ ను మార్చేసింది. తాను తెలిసి ఈ అడుగు వేశారా? లేదా ఏదైనా ప్రయోజనం ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
చేతులు కలపడాన్ని...
ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఏదో ఒకటి రెండుసీట్లయినా దక్కేవి. కానీ కాంగ్రెస్తో కలవడం వల్ల వైఎస్ అభిమానులను కూడా షర్మిల దూరం చేసుకున్నట్లయింది. జగన్ ను కేసుల్లో ఇరికించిన కాంగ్రెస్తో చేతులు కలపడాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. ఎవరికీ చెప్పకుండా తాను హడావిడిగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ ను కలసి రావడం, బెంగళూరుకు వెళ్లి పదే పదే డీకే శివకుమార్ తో మంతనాలు జరపడం వైఎస్ ను అభిమానించే వేలాది మందికి రుచించలేదు. దీంతో షర్మిల ఇప్పుడు తెలంగాణలో ఒంటరి అయిపోయారన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. ఇటు సొంత సామాజికవర్గంతో పాటు వైఎస్ అభిమానులను కూడా షర్మిల తన నిర్ణయంతో దూరం చేసుకున్నట్లయింది.
విలీన ప్రతిపాదన...
పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చేసిన ఆమె ప్రతిపాదన కూడా ఇప్పటి వరకూ అమలు కాలేదు. వైఎస్ వ్యతిరేక వర్గం తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ కావడంతో పాలేరు సీటు కూడా దక్కే అవకాశం లేదు. గత నెల 30వ తేదీ వరకూ షర్మిల కాంగ్రెస్కు డెడ్ లైన్ విధించారు. దానికి కూడా స్పందన లేదు. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. ఇప్పుడు షర్మిల ఒకే ఒక ఆప్షన్. తాను ఒంటరిగా పోటీ చేయడమే. తన పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాల్సిన పరిస్థిితి ఏర్పడింది.
ఆప్షన్లు ఇవే...
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకూ సానుకూల స్పందన రాకపోవడంతో ఇక షర్మిల ముందు మిగిలిన ఆప్షన్ ఒంటరిగా బరిలోకి దిగడం. లేదంటే తాను ఒక్కరే పోటీ చేయడం. మరొక ఆప్షన్ పోటీకి దూరంగా ఉండి ఎన్నికల అనంతరం కాంగ్రెస్ లో విలీనం చేయడం. మరి షర్మిల ఏం చేస్తారన్నది ఈ రోజు, రేపట్లో తెలియనుంది. 119 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ఖరారు చేయడం కూడా సాధ్యం కాని పని కావడంతో ఆమె ఒంటరిగానే బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి షర్మిల ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story