Sun Dec 22 2024 16:37:21 GMT+0000 (Coordinated Universal Time)
Congress : శభాష్.. సరైనోళ్లను ఎంపిక చేశారు.. ట్రాక్ రికార్డు చూసిన తర్వాతనే
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను ఖరారు చేయడంపై పార్టీలో సంతోషం వ్యక్తమవుతుంది
నిజమే... గుడ్ సెలక్షన్.. వీరిద్దరి పేర్లను అధినాయకత్వం ఖరారు చేయడం సబబే. పదేళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉండి, విపక్షంలో ఉండి నాటి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే అందుకు అనువైన శక్తి కావాలి. తపన కావాలి. పార్టీ పట్ల అంకిత భావం ఉండాలి. తరచూ పార్టీలు, జెండాలు మార్చే వారికి ఏదో పదవి అన్ని పార్టీల్లోనూ లభిస్తూనే ఉంటుంది. వారిది అవకాశవాద రాజకీయం అని తెలిసినా.. సామాజిక కోణంలోనో, ఆర్థికపరంగానో చూసి వారికి అందలం ఎక్కిస్తారు. ఏ పార్టీ అయినా దీనికి అతీతం కాదు. అందుకే పార్టీలను క్షణాల్లో మార్చేందుకు ఎవరైనా సిద్ధపడతారు. తమకు పదవి లభిస్తే చాలు అని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
ఎమ్మెల్యే కోటాలో...
కానీ ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన వారిద్దరూ సరైనోళ్లే. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లు ఇద్దరూ పదేళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారే. ఉద్యమ కాలం నుంచి ఉన్నవారైనా పార్టీ ఆదేశాలను ఎన్నడూ బేఖాతరు చేయలేదు. పార్టీ ఇచ్చిన పనిని వాళ్లు పూర్తి చేయడానికే ప్రయత్నించారు. కానీ వారికి గత ఎన్నికల్లో కాలం కలసి రాలేదు. లెక్కలు సరిపోలేదు. సర్వేలు వీరివైపు చూడలేదు. అందుకే వారిద్దరికీ టిక్కెట్లు గల్లంతయ్యాయి. అయితేనేం.. అప్పుడే వారికి హామీ లభించింది. అధికారంలోకి రాగానే చట్టసభలకు పంపుతామని ఇచ్చిన హామీని వారు నమ్మారు. పార్టీ కోసం పనిచేశారు. ఫలితంగా ఈరోజు ఎమ్మెల్సీలు కాబోతున్నారు.
కుర్చీకే గౌరవం ఇచ్చి...
అద్దంకి దయాకర్ కు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది. ఆయనకు బీఆర్ఎస్ నేతలతో సంబంధాలున్నా ఎప్పుడూ గులాబీ పార్టీ వైపు చూడలేదు. 2014 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి చూసి కుంగిపోలేదు. టీవీ చర్చల్లో అద్దంకి దయాకర్ పాల్గొని అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ప్రయత్నించారు. తెలంగాణ కాంగ్రెస్ వాయిస్ గా నిలిచారు. పీసీసీ చీఫ్ లు మారినా.. ఆయన ఎవరి పక్షాన నిలబడలేదు. ఎవరిని పార్టీ ఆ కుర్చీలో కూర్చోబెడితే.. ఆ కుర్చీకే గౌరవం ఇచ్చిన అద్దంకి దయాకర్ కల ఎట్టకేలకు సాకారం కానుంది. ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం సముచితమైన నిర్ణయం అని పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి.
విద్యార్థి సంఘం నేతగా...
అదే విధంగా బల్మూరి వెంకట్ కాంగ్రెస్ అనుబంధ సంఘం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేశారు. అనేక కేసులను ఎదుర్కొన్నారు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. చివరకు ఒకానొక దశలో ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తే జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే మారు మాట్లాడకుండా ఓకే చెప్పారు. ఆయన ఒంటరిగానే అప్పుుడు పార్టీ కోసం ప్రచారం చేసుకున్నారు. డిపాజిట్లు దక్కలేదు. అయినా కుంగిపోలేదు. ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా రాలేదు. కానీ నిరాశ పడలేదు. పార్టీ వెంటే నడిచారు. ఇప్పుడు నక్క తోక తొక్కినట్లు ఎమ్మెల్సీ కాబోతున్నారు. అందుకే ఇద్దరి పేర్లను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ మంచి నిర్ణయమే తీసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇందులో వేరే అభిప్రాయానికి, విమర్శలకు తావు లేదు.
Next Story