Sun Dec 22 2024 17:55:26 GMT+0000 (Coordinated Universal Time)
ys jagan : కేసీఆర్ బెటర్ గా ఉన్నారా.. జగన్‌లో ఆ బెదురెందుకు?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినట్లుగానే ఎక్కువమంది సిట్టింగ్‌లకు ఈసారి ఎన్నికల్లో సీట్లు జగన్ ఇచ్చే అవకాశం లేదు.
రాష్ట్ర విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలిక సహజంగానే ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినా ఒకే భాష మాట్లాడుతూ, నిన్నటి వరకూ కలసి ఉన్న ప్రజలు కావడంతో సహజంగా ఒక రాష్ట్రంపై మరొకరికి ఆసక్తి ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందన్న ఆరా తీస్తుంటారు. కొన్నింటిలో కేసీఆర్‌ది పైచేయి అయితే, మరికొన్ని విషయాల్లో జగన్ ది అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. సంక్షేమాల విషయంలో ఇద్దరూ దూసుకు వెళుతున్నారు. ఇద్దరు సొంతంగా పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చిన వారే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనతతో అధికారం దక్కించుకుంటే.. జగన్ మాత్రం చెమటోడ్చి పవర్ ను తన పరం చేసుకున్నాడు. కేసీఆర్ వయసులో పెద్దవాడు కావచ్చు. రెండుసార్లు గెలిచిన అనుభవం ఉండి ఉండవచ్చు. కానీ జగన్ మాత్రం తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు.
ఇద్దరూ మొండోళ్లే...
ఇద్దరూ మొండి వాళ్లేనన్న పేరుంది. రాజకీయంగా ఇద్దరూ ప్రజలను నేరుగా కలవరు. బహిరంగ సభల్లో కనిపించడం మినహా వీరిని కలవాలంటే మంత్రులకు కూడా సాధ్యం కాదు. ఎన్నికలప్పుడే ఎక్కువగా ఇద్దరూ తిరుగుతుంటారు. గిట్టని వారు నియంతలని అన్నా కొన్ని విషయాల్లో అంగీకరించక తప్పదు. ప్రాంతీయ పార్టీలు కావడం, సొంతంగా పార్టీ పెట్టి అధికారాన్ని తెచ్చుకోవడం, తమ బొమ్మను చూపి జనాన్ని తిప్పుకోవడంలో ఇద్దరూ ఆరితేరారు కాబట్టి సహజంగా ఆ మాత్రం పొగరు ఉండటం తప్పు కాదనిపిస్తుంది. అలాగని ప్రజలకు పూర్తిగా దూరమయితే మాత్రం భవిష్యత్ లో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పక తప్పదు. అయితే చాలా వరకూ ఇద్దరిలో ఒకటే రకమైన ఆలోచనలు ఉన్నాయి.
సిట్టింగ్‌లందరికీ...
కానీ ఎన్నికల విషయంలో మాత్రం కేసీఆర్ సాహసం చేశారనే చెప్పాలి. మూడో సారి గెలవాలంటే ఆషామాషీ కాదు. కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుంటే పుట్టి మునుగుతుందని కూడా ఆయనకు తెలియంది కాదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుసు. అనేక సంక్షేమ పథకాలను తమ అనుచరులకే కట్టబెట్టుకున్నారన్న ఆరోపణలు ఆయనే బయటపెట్టారు. అలాంటిది నలుగురైదుగురు మినహాయిస్తే 99 శాతం మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వడమంటే ఆషామాషీ విషయం కాదు. అందునా ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను కాదని ఆయన సిట్టింగ్‌లకు సీట్లిచ్చి తిరిగి తన బొమ్మే గెలుపు వైపు తీసుకెళుతుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. అందుకే కాలికి బలపం కట్టుకుని మరీ ప్రతి నియోజకవర్గం తిరుగుతూ తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
వైసీపీ అధినేత మాత్రం...
జగన్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా కనిపిస్తున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ లేదు. ఈ విషయాన్ని ఆయనే పార్టీ సమావేశంలో చెప్పారు. జగన్ కూడా తన ఫొటోతోనే ఈసారి కూడా అధిక సీట్లలో గెలవాలని చూస్తుననారు. అయితే ఏపీలో ఈసారి మాత్రం సిట్టింగ్‌లలో దాదాపు ముప్పయి నుంచి నలభై మందికి సీట్లు దక్కే అవకాశాలు లేవు. కొత్త వారిని ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత టిక్కెట్ దక్కని వారు పార్టీలో ఉంటారా? లేదా? అన్న విషయం తెలియదు కానీ కేసీఆర్ చేసిన సాహసం జగన్ చేసే అవకాశాలు లేవు. రెండోసారి తాను అధికారంలోకి రావాలంటే కొందరు సీట్లను త్యాగం చేయాల్సిందేనని జగన్ పదే పదే చెబుతున్నారు. ఈరకంగా చూసుకుంటే జగన్ కంటే సిట్టింగ్‌లందరికీ సీట్లు కేటాయించడంలో కేసీఆర్‌దే పైచేయి అని చెప్పకతప్పదు.
Next Story