Wed Jan 15 2025 08:54:24 GMT+0000 (Coordinated Universal Time)
Uttam Kumar Reddy : గడ్డం అందుకే తీయలేదా? ముఖ్యమంత్రి అయ్యే వరకూ తీయవా బాసూ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయకపోవడంపై అసెంబ్లీ లాబీల్లో చర్చ జరుగుతుంది.
రాజకీయాల్లో కొందరు దీర్ఘకాలంలో పెద్ద పదవులు అందుకున్న వారిని చూశాం. కానీ మరికొందరు షార్ట్ కట్ లో వచ్చి అందలం ఎక్కిన తీరునూ మనం చూశాం. అదృష్టం తలుపు తట్టేలోగా దురదృష్టం షేక్ హ్యాండ్ ఇస్తుందన్న సామెత కొందరి రాజకీయనేతల్లో రుజువవుతుంది. వారిని ఏం చేయలేం. వారు నిజాయితీతో నిబద్ధతో పనిచేసినా ఆశించిన ఫలం దక్కదు. అందరూ ఆయనే ముఖ్యమంత్రి అనుకున్న సమయంలో పార్టీ అధికారంలోకి రాదు. అలా కొందరు నేతలను ఎవరూ ఏమీ చేయలేరు. రాజకీయాల్లో వారి ఎదుగుదల అంతే అని సంతృప్తి పడాలి తప్ప మరొకటి ఉండదు. అలాగని ఆ నేతను తక్కువగా చేసి చూడకూడదు. తన ప్రయత్నాలను చివర వరకూ చేస్తూనే ఉంటారు. అందుకే ఆయన తన గడ్డాన్ని తీయలేదని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు.
నిఖార్సయిన నేతగా...
అలాంటి నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత రెండుసార్లు పీసీీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేకపోయారు. కానీ నాలుగేళ్ల క్రితం చేరిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇందులో రేవంత్ ను తప్పు పట్టలేం. రేవంత్ వచ్చే నాటికి అన్నీ ఆయనకు అనుకూలంగా గ్రహాలు పనిచేశాయి. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు ఆయన ఇస్తున్న సంక్షేమ పధకాలు ఆయనకు కొంత ఇబ్బంది తెచ్చి పెట్టాయి. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యే సమయానికి తెలంగాణ సెంటిమెంట్ కూడా బలంగా లేకపోవడం ఆయనకు కలసి వచ్చిందనే అనుకోవాల్సి ఉంటుంది.
రెండుసార్లు పీసీసీ...
కానీ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో కేసీఆర్ పై అసంతృప్తి లేకపోవడం, సెంటిమెంట్ ఇంకా బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఫలితంగా రెండుసార్లు సీఎం కుర్చీని ఉత్తమ్ మిస్ అయ్యాడనే చెప్పాలి. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాయితీపరుడైన రాజకీయ నేత. ఆయనకంటూ వారసులు ఎవరూ లేరు. కుట్ర రాజకీయాలు తెలియదు. ఏదున్నా నిక్కచ్చిగా మాట్లాడతాడు. పార్టీని నమ్ముకుని ఏళ్లుగా అంటిపెట్టుకుని ఉన్నాడు. కార్యకర్తలకు అండగా ఉన్నాడు. పైగా రేవంత్ కు లేనిది.. ఉత్తమ్ కు ఉన్నది రాజీవ్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధమే. ఉత్తమ్ పైలట్ గా చేయడమే కాకుండా విద్యావంతుడు కూడా కావడం అదనపు అర్హత.
సీఎం అవుతారని...
అలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రిపదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విధి ఆడిన వింత నాటకంలో ఉత్తమ్ లాంటి వాళ్లు ఎంతో మంది రాజకీయాల్లో ఇలా తారసపడుతుంటారు. పార్టీని గాడిన పెట్టి ఏళ్లకు ఏళ్లు కష్టపడి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా అత్యున్నత పదవి మాత్రం అందుకోలేకపోయారు. కానీ ఉత్తమ్ లాబీయింగ్ మామూలుగా ఉండదన్నది ఆయన సన్నిహితుల నమ్మకం. ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి పదవి తమ నేతకు దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఈ మేరకు హైకమాండ్ నుంచి ఆయనకు హామీ కూడా లభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఉత్తమ్ కు సీఎం పదవి దక్కడం ఖాయమని, అందుకే ఆయన తగ్గి మంత్రిపదవిలో కూర్చుండిపోయారన్న కథనాలు కూడా రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్నాయి. అందుకే గడ్డం తీయలేదని అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు చర్చించుకోవడం వినిపించింది.
Next Story