Fri Dec 20 2024 06:47:33 GMT+0000 (Coordinated Universal Time)
Renuka Chaudhary : రేణుకకు దారులు మూసుకుపోతున్నాయా.. ఆ నేత ఎంట్రీతో
సీనియర్ నేత రేణుకా చౌదరికి ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వడంపై పార్టీలో తర్జన భర్జన జరుగుతుంది
సీనియర్ నేత రేణుకా చౌదరికి ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వడంపై పార్టీలో తర్జన భర్జన జరుగుతుంది. ఆమె స్థానంలో కొత్త వారికి అవకాశమివ్వాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అత్యధిక సంఖ్యలో పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని సిద్ధమవుతుంది. అందుకనే ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. సామాజికపరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా బలమైన నేత ను ఎంపిక చేయాలని హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు అందినట్లు తెలిసింది.
పోటీ ఎక్కువగానే...
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలవడంతో సహజంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతారు. అంతే కాకుండా ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్, భువనగిరి, నిజామాబాద్ వంటి పార్లమెంటు స్థానాలకు మరీ ఎక్కువ మంది ఆశావహులుంటారు. అక్కడ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో సహజంగానే వారే తమను గెలిపించుకుంటారని నమ్మకం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల్లో ఉంటుంది. ఎన్నికల ఖర్చు కూడా వారే భరించే అవకాశముండటంతో పోటీ ఈసారి కాంగ్రెస్ లో ఎక్కువగానే కనపడుతుంది.
ఎక్కువ స్థానాలను గెలవడంతో...
ఖమ్మం జిల్లాలో పది శాసనసభ నియోజకవర్గాలకు గాను తొమ్మిదింటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. సాధారణంగా ఎన్నికలను పరిశీలిస్తే ఖమ్మం పార్లమెంటులో ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి 1999, 2004లో ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలు కావడంతో ఆమె రాజ్యసభకు పార్టీ హైకమాండ్ పంపింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అక్కడ వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మరోసారి నామా నాగేశ్వరరావు పై పోటీ చేసి రేణుకా చౌదరి ఓటమి పాలయ్యారు. రెండుసార్లు నామా మీదనే ఆమె ఓటమి పాలు కావడం విశేషం.
మరో పారిశ్రామికవేత్త పేరు...
ఈసారి కూడా వారిమధ్యనే పోటీ జరిగితే ఓటమి ఖాయమని భావించిన జిల్లా నేతలలో కొందరు పార్టీ హైకమాండ్ ఆమెను పోటీ చేయించవద్దని చెబుతున్నారట. ప్రధానంగా ఆమె అక్కడ ముఖ్యమైన నేతతో సయోధ్య లేకపోవడం, ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు, కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్న మరొక నేత కూడా రేణుక సీటు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన మరో పారిశ్రామిక వేత్త కోసం కాంగ్రెస్ ముఖ్యనేత ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే రేణుకకు ఖమ్మం పార్లమెంటు సీటు వచ్చేది అనుమానమేనంటున్నారు. క్యాడర్ కూడా ఆమెకు సహకరించదని ఇప్పటికే హైకమాండ్ కు కొందరు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. మరి రేణుకకు టిక్కెట్ వస్తుందా? లేదా? అన్నది మాత్రం చివర క్షణం వరకూ తేలేలా కన్పించడం లేదు.
Next Story