Thu Nov 21 2024 22:46:47 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఆ రెండింటిలోనూ జగన్ ఫెయిల్యూరేనా? జనం అనుకుంటుంది ఇదేనా?
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు విమర్శించిన ఆ రెండు అంశాలే ఇప్పుడు జగన్ వైపు కూడా వేలెత్తి చూపుతున్నాయి
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు విమర్శించిన ఆ రెండు అంశాలే ఇప్పుడు జగన్ వైపు కూడా వేలెత్తి చూపుతున్నాయి. జనంలోనూ ఇదే చర్చ జరుగుతుంది. రెండు ప్రభుత్వాలు మారినా.. ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసినా ఎవరూ వీటిని పూర్తి చేయకపోవడంపై ఏపీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో నిర్మాణం కానివి జగన్ పాలనలోనైనా పూర్తవుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురయింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు నెలల్లో ఈ రెండు ప్రధాన పనులు పూర్తయ్యేందుకు అవకాశమే లేదు. అదే విమర్శను జగన్ ఇప్పుడు ఎదుర్కొనడం.. అదీ ఎన్నికలకు ముందు ఇవి వైసీపీకి తలనొప్పిగా మారనున్నాయి.
పోలవరం ఇక అంతేనా?
ఆంధ్రప్రదేశ్కు ప్రాణప్రదాయిని పోలవరం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో వ్యవసాయ రంగం కొంత పుంతలు తొక్కనుంది. తాగు, సాగునీటికి ఇబ్బందులుండవు. పేరుకు జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు అయినప్పటికీ పదేళ్లవుతున్నా అది పూర్తి కాలేదు. గతానికి భిన్నంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. పోలవరం ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే తాము పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు దానిని పూర్తి చేయలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. దానికి కేంద్రం నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడం అని వైసీపీ నేతలు చెప్పినా జనం వినే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలకు కూడా సాయం అందించలేకపోయారంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా? చేతకాని తనమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మూడు రాజధానులంటూ....
ఇక గత ప్రభుత్వం అమరావతిని ఏపీకి రాజధానిగా ప్రకటించింది. తాత్కాలిక భవనాలను నిర్మించింది. అమరావతి రాజధాని నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా పక్కన పెట్టేసింది. తాము అమరావతి రాజధానికి వ్యతిరేకమని, మూడు రాజధానులంటూ కొత్త గళం అందుకుంది. మూడు రాజధానులని జగన్ అసెంబ్లీలో ప్రకటించి నాలుగేళ్లవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి న్యాయపరమైన వివాదాలు కారణమని చెప్పుకోవచ్చు కానీ, ఇటు ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న అపవాదును జగన్ ఎదుర్కొనక తప్పడం లేదు. మూడు రాజధానులు కూడా ఏర్పాటు కాలేదు. కేవలం సంక్షేమానికే పెద్దపీట వేసిన జగన్ అభివృద్ధి పనులను పూర్తిగా పక్కన పెట్టేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాడు ఏం చెప్పారు?
ఇంతకూ ఐదేళ్లలో రాష్ట్రంలో ఏం చేశారని ప్రశ్నించిన వాళ్లకు బటన్ నొక్కడం మినహా మరొక జవాబు లేకుండా పోయింది. రెండు ముఖ్యమైన అంశాలను జగన్ ప్రభుత్వం కూడా పక్కన పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానులంటే న్యాయపరమైన వివాదాలున్నాయని చెబుతున్న జగన్ బ్యాచ్ మరి పోలవరం ఈ ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నది మాత్రం చెప్పలేకపోయారు. గత ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వానికే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పగిస్తే మంచిదని సూచించిన వైసీపీ నేతలు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ ఊసే మరచి పోయారు. మొత్తం మీద రానున్న ఎన్నికల్లో రాజధాని, పోలవరం అంశాలు వైసీపీ మెడకు చుట్టుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వీట ి నుంచి జగన్ పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి.
Next Story