Mon Dec 23 2024 14:17:00 GMT+0000 (Coordinated Universal Time)
Congress : పెద్దల సభకు పెద్ద కాంపిటేషన్.. పేర్లు మాత్రం చాంతాడంత.. సీట్లు మాత్రం?
తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్ కు రెండు స్థానాలు దక్కనున్నాయి
తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు పదవీ విరమణ చేయడంతో వచ్చే నెల 27వ తేదీన జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కు చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్లు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలోనే అభ్యర్థులు ఎవరా? అన్న దానిపై స్పష్టత వస్తుంది.
మూడు స్థానాలకు...
తెలంగాణలో జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి బలాబలాలను పరిశీలిస్తే రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలున్నాయి. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి ముప్పయి మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ కు రెండు రాజ్యసభ స్థానాలు గ్యారంటీ అని చెప్పక తప్పదు. పైగా సీపీఐ నుంచి ఒక ఎమ్మెల్యే మద్దతు కూడా ఉండటంతో రెండింటిని కాంగ్రెస్ పార్టీ సులువుగానే కైవసం చేసుకుంటుంది. మూడోది మాత్రం బీఆర్ఎస్ కు వదిలేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ కు కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీకి ఒక స్థానం దక్కనుందని లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి.
సీనియర్ నేతగా...
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. బీసీ నేత సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తనకు మరొకసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన గత కొంత కాలం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సఖ్యతగానే సాగుతున్నారు. వీహెచ్ పేరును బీసీ కోటా కింద పరిశీలిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. వీహెచ్ కి ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ ఇవ్వడంతో మూడోసారి కూడా ఆయనకే ఇస్తారా? అన్న సందేహం కూడా ఉంది. అయితే గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేత కావడంతో ఆయన పేరు లిస్ట్ లో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
సామాజిక కోణంలో...
మరోవైపు తెలంగాణలో సామాజికవర్గాల పరంగా చూసుకుంటే బీసీలతో పాటు ఎస్సీలకు కూడా కేటాయించాల్సి ఉంది. ఈ సామాజికవర్గాల నుంచి కూడా అనేక మంది పోటీ పడుతున్నారు. అలాగే తనను రాజ్యసభ కు పంపాలని సీనియర్ నేత జానారెడ్డి కూడా కోరినట్లు తెలిసింది. పార్టీ కోసం తమ కుటుంబం పడిన శ్రమను కూడా గుర్తుంచుకోవాలని ఆయన కోరుతున్నారు. ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా రాజ్యసభ టిక్కెట్ ను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా రాజ్యసభ సీటు కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. చివరకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story