Fri Nov 22 2024 20:50:00 GMT+0000 (Coordinated Universal Time)
దమ్ముంటే వాళ్లకు సీట్లివ్వండి : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనాయకులు అందుబాటులో ఉండేదానిని బట్టి బహిరంగ సభలు ఉంటాయన్న రేవంత్ రెడ్డి.. కర్ణాటకలో మాదిరిగానే..
తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 2004 నుండి 2014 వరకూ తెలంగాణ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, 2014 నుండి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య అజెండా అని విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనాయకులు అందుబాటులో ఉండేదానిని బట్టి బహిరంగ సభలు ఉంటాయన్న రేవంత్ రెడ్డి.. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ను కొద్దిమంది భూస్వాముల కోసమే తీసుకొచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిని పూర్తిగా రద్దుచేస్తామని తెలిపారు. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించాలంటే.. యూత్ కాంగ్రెస్ కియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్, కేటీఆర్ లకు రేవంత్ రెడ్డి ఓ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ సభలు నిర్వహించిన ప్రాంతంలో వీరే రాబోయే ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులు అని ఎందుకు ప్రకటించడంలేదని ప్రశ్నించారు. దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లిస్తామని ప్రకటించాలని రేవంత్ సవాల్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ కాస్తా.. లీకులు, లిఫ్టులు, లిక్కర్ గా మారిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారో బీఆర్ఎస్ నేతలకే స్పష్టతలేదన్నారు. అలాగే తనకు ఓఆర్ఆర్ ఇష్యూపై ఇచ్చిన లీగల్ నోటీసుకు రేపు సమాధానం ఇస్తున్నట్లు రేవంత్ తెలిపారు.
Next Story