3 గంటలన్నా.. 3 చెరువుల నీళ్లు తాగినా.. వచ్చేది కాంగ్రెస్సే
తెలంగాణలో రాజకీయం మాంచి హీట్ మీదుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఫ్రీ కరెంట్‌పై చేసిన కామెంట్స్..
తెలంగాణలో రాజకీయం మాంచి హీట్ మీదుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఫ్రీ కరెంట్‌పై చేసిన కామెంట్స్.. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల మంటలను రాజేశాయి. కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత తెలంగాణ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు దూకుడు పెంచారు. ఇప్పుడైతే ఫ్రీ కరెంట్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మరోసారి కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ''కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్… రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్.'' అంటూ ట్వీట్ చేశారు.
రైతు జీవితాల్లో చీకటి రోజులు తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది: పువ్వాడ
వ్యవసాయ అవసరాలకు 24 గంటల కరెంటు ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి రుజువైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వ్యవసాయ అవసరాలకే మూడు గంటల కరెంటు ఇస్తామంటూ కాంగ్రెస్ నాయకులు పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని, రైతులు నష్టపోతారని హెచ్చరించారు. రైతులను, వ్యవసాయాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని 24 గంటల పాటు కరెంటు ఇస్తే రైతులు తమకు అనుకూలమైన సమయంలో, పంటల అవసరాలకు అనుగుణంగా పంటలకు నీళ్లిస్తారని మంత్రి అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని కాంగ్రెస్ అంటుండగా, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని బీజేపీ అంటోంది. రెండు పార్టీలు రైతు, ప్రజా వ్యతిరేక పార్టీలని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక వైఖరికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో రాత్రిపూట సరఫరా చేయడంతో కరెంటు షాక్‌లు, పాముకాటుకు గురై రైతులు మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ మధ్యవర్తుల కోసం, బీజేపీ అదానీ, అంబానీల కోసం పనిచేస్తుంటే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతుల కోసం పనిచేస్తున్నారని అజయ్‌కుమార్ అన్నారు.
కాంగ్రెస్ ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీ: ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అండగా ఉంటే.. కాంగ్రెస్ రైతులను నష్టపరిచే ప్రయత్నం చేస్తోందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బషీర్‌బాగ్‌లో ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరపాలని పోలీసులకు సూచించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు రైతుల ప్రాణాలను బలిగొన్నారని, ఆయన శిష్యుడు రేవంత్ వ్యవసాయ రంగానికి విద్యుత్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు. దేశాన్ని పోషించే రైతు సమాజాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ ద్వేషిస్తుందని మంత్రి అన్నారు. వ్యవసాయ రంగానికి రోజుకు మూడు గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీ అని రుజువు చేసిందని ఆయన అన్నారు.