Thu Dec 19 2024 06:59:09 GMT+0000 (Coordinated Universal Time)
Kishan Reddy : ఏందన్నా ఇట్లయితంది... రివర్స్ లో వచ్చి తగులకుంటున్నారుగా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టంగ్ స్లిప్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రిని భారీగానే తగులుకున్నారు
ఒక్కోసారి అంతే.. రాజకీయాల్లో ఆచితూచి మాట్లాకపోతే... రివర్స్ లో ఎదురుదెబ్బలు తగులుతాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి కూడా అదే రకంగా తయారయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో బీజేపీ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేసింది. కేంద్ర బృందాలు కూడా వచ్చి కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ప్రభుత్వానికి నివేదికను అందచేశారు. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును మరమ్మతులు చేయాల్సి ఉంటుందని, పునాదులు సక్రమంగా లేకపోవడం వల్లనే కుంగిపోయిందని కేంద్రానికి తన నివేదిక ఎన్నికలకు ముందే సమర్పించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, కుంగిన మేడిగడ్డ బ్యారేజీ బీఆర్ఎస్ ను భారీగా డ్యామేజీ చేశాయనే చెప్పాలి. బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఒక కారణమని చెప్పకతప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా ప్రకటించారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు సందర్శించి బ్యారేజి నిర్మాణంలో అనేక లోపాలున్నాయని, నిర్మించిన కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా లొసుగులున్నాయని మంత్రులు చెప్పారు. త్వరలోనే దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించారు.
విమర్శలు చేయాలని...
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ చేత విచారణ చేయించకపోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని ఆయన విమర్శ చేయడానికి పూనుకున్నారు. కానీ అదే ఆయనకు రివర్స్ లో వచ్చి తగులుతుంది. కాంగ్రెస్ నేతలు బాగానే తగులుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను రక్షించిన బీజేపీ ప్రభుత్వం మరోసారి సీబీఐ విచారణకు తాము కోరితే కేసీఆర్ ను రక్షించడానికేనా అని ఎదురుదాడికి దిగారు.
సీబీఐ విచారణకు ఇస్తే...
సీబీఐ అంటేనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సంస్థ. నిజంగా కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలనుకున్నా, సీబీఐ చేత ఎంక్వైరీ చేయాలనుకున్నా అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే సాధ్యం. అయితే దానిని వదిలేసి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరలేదని విమర్శలకు దిగడం నవ్వులపాలయ్యే విధంగా ఉంది. కాంగ్రెస్ పై బురదజల్లడానికి చేసిన ప్రయత్నం తిరిగి ఆయన బట్టలపైనే పడేవిధంగా తయారయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి ఏదో అనుకుంటే అదేదో అయినట్లుగా బూమ్ రాంగ్ అయిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
Next Story