Big Breaking : చంద్రబాబు పచ్చి మోసగాడు.. టీడీపీకి రాజీనామా చేస్తున్నా.. వైసీపీలో చేరుతున్నా
తాను వైసీపీలో చేరబోతున్నానని, టీడీపీకి రాజీనామా చేస్తున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు
గత రెండు ఎన్నికల్లో తాను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ నుంచి గెలిచానని, అయితే చంద్రబాబు తనను వద్దనుకున్నారన్ని కేశినేని నాని అన్నారు. జగన్ తో మాట్లాడి వచ్చిన తర్వాత కేశినేని మీడియాతో మాట్లాడారు. కేశినేని నాని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో కలసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. జగన్ తో సమావేశమయ్యారు. అన్ని ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి తన శాయశక్తులా కృషి చేశానని చెప్పారు. చంద్రబాబును గెలిపించుకోవడమే లక్ష్యంగా పదేళ్ల నుంచి తాను పనిచేశానని కేశినేని నాని చెప్పుకొచ్చారు. 2014లో జిల్లాలో ఎక్కువ స్థానాలను గెలుచుకున్నామని, అదంతా తన సొమ్మే వెచ్చించి ఎన్నికలలో పార్టీని గెలిపించుకున్నానని కేశినేని తెలిపారు.
కష్టపడి పార్టీ కోసం పనిచేసినా...
టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, తాను రెండు వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని, వ్యాపారాన్ని కూడా రాజకీయం కోసం మూసివేశానని కేశినేని నాని తెలిపారు. 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిలో ఓడిపోతే తాను ఎంపీగా గెలిచానని చెప్పారు. ఆయన మనుషులను బెట్టి తనను అవమానించారన్నారు. మేయర్ అభ్యర్ధిగా తన కుమార్తెను నిలబెట్టింది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. క్యారెక్టర్ లేని మనుషులు తనను తిట్టినా పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి నేతల వల్లనే విజయవాడ నగరంలో పార్టీ నాశనం అయిందన్నారు. రాబిన్ శర్మ టీం కార్పొరేటర్లు ఐదుగురు కంటే ఎక్కువ మంది గెలవరని నివేదిక ఇచ్చినా తన డబ్బు పెట్టి కష్టపడి పథ్నాలుగు మందిని గెలిపించుకున్నానని తెలిపారు.
జగన్ తనను...
ఎంతో మంది చెప్పినా తాను టీడీపీలో కొనసాగానని అన్నారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టి లోకేష్ తనను కొట్టించాలని భావించారన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో తాను చేసిన తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని ఇదంతా చూసి అర్థమయిందన్నారు. ఈరోజు ఎంపీ పదవికి మెయిల్ లో స్పీకర్ కు పంపుతానని చెప్పారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశానని కేశినేని నాని తెలిపారు. తనను బాగా జగన్ రిసీవ్ చేసుకున్నారని, కలసి పనిచేద్దామని చెప్పారన్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు పనికి రాడని కేశినేని నాని అన్నారు. వైఎస్ జగన్ నిరుపేదల పక్షపాతి అని అన్నారు. త్వరలోనే వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు. జగన్ అప్పజెప్పిన బాధ్యతలను తాను స్వీకరిస్తానని అన్నారు.
లోకేష్ పై విమర్శలు...
లోకేష్ పార్టీ కోసం ఏం త్యాగం చేశాడని పాదయాత్ర చేశాడన్నారు. తాను ఆస్తులను అమ్ముకున్నానని, లోకేష్ హెరిటేజ్ అమ్ముకున్నాడా? అని కేశినేని నాని ప్రశ్నించారు. అందుకే తాను లోకేష్ పాదయాత్రకు దూరంగా ఉన్నానని అన్నారు. తాత, తండ్రి పేరు చెప్పుకుని పార్టీలోకి వచ్చి ఇప్పుడు తమలాంటి వాళ్లను లోకేష్ బయటకు పంపుతున్నారని అన్నారు. లోకేష్ కు రాజకీయ జ్ఞానం లేదన్నారు. తనను గొట్టంగాడు అని తిట్టించింది కూడా లోకేష్ అని ఆయన ఆరోపించారు. తాను ఎవరినీ టిక్కెట్ అడగలేదని, నాడు చంద్రబాబును టిక్కెట్ అడగలేదని, ఇప్పుడు జగన్ కూడా టిక్కెట్ ఇవ్వమని అడగలేదని కేశినేని నాని అన్నారు.