Sun Dec 22 2024 15:16:11 GMT+0000 (Coordinated Universal Time)
AP BJP : ఇచ్చేది వారట.. తీసుకునేది అవతల వారట.. తాము తీసుకోబోమంటున్నారే
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందన్నది వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది. వైసీపీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తులు చేస్తుంది. వైసీపీ అధినేత జగన్ ఎడా పెడా అభ్యర్థులను మార్చేస్తున్నారు. కొందరిని వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేస్తుండగా, మరికొందరిని పూర్తిగా పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలను పిలిపించి వారితో నేరుగా మాట్లాడుతున్నారు. వారికి సీటు దక్కకపోతే ఏం చేస్తానన్న దానిపై క్లారిటీ ఇస్తున్నారు.
ఈ రెండు మాత్రం...
మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు ఖరారయింది. రెండు పార్టీలూ పొత్తుతోనే ఈ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఈ కూటమితో కలుస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఈ కూటమితో కలవకపోతే ఒంటరిగా పోటీ చేస్తుంది. అప్పుడు టీడీపీ, జనసేన కూటమితో వామపక్షాలు కలుస్తాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కలసి పోటీ చేస్తే వామపక్షాలు విడిగా పోటీ చేస్తాయి. ఇది మాత్రం క్లారిటీ. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తాము జనసేనతోనే ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తామని రాష్ట్ర పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు.
హైకమాండ్ నిర్ణయం...
కేంద్ర పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇంకా తెలియరాలేదు. బహుశ వచ్చే నెలలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే బీజేపీ నేతలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తాము భాగస్వామ్య పక్షాలుగా శాసించే స్థాయిలో ఉంటామని.. యాచించే స్థాయిలో ఉండమని చెబుతుంది. అంటే తెలంగాణ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమిలోని జనసేన పార్టీకి తాము ఎనిమిది సీట్లు కేటాయించామని చెబుతుంది. ఏపీలోనూ తమ కూటమిలో పార్టీలకు స్థానాలను కేటాయించే స్థితిలోనే ఉంటామని, ఒకరు ఇచ్చే స్థితిలో మాత్రం ఉండమని ఆ పార్టీ నేతలు చెబుతుండటంతో కొత్త సందేహాలకు తెర లేచింది. ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయమా? రాష్ట్ర నేతల అభిప్రాయమా? అన్నది తెలియరాలేదు.
ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని...
తెలంగాణలో పరిస్థితులు వేరు. ఏపీలో సీన్ వేరు. ఇక్కడ టీడీపీ, జనసేన కంటే బీజేపీ బలహీనంగా ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ టీడీపీకి, జనసేనకు స్థానాలు ఇచ్చే పరిస్థితి బీజేపీకి ఉండదన్నది అందిరికీ తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని ఏపీలోనూ తాము వ్యవహరిస్తామనుకోవడం మాత్రం అది భ్రమే అవుతుందంటున్నారు. మరి టీడీపీ, జనసేన కూటమిలో చేరుకుండా ఉండేందుకు బీజేపీ ఇలాంటి కొత్త మెలిక పెడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఏ రకమైన వ్యూహాలు అనుసరిస్తుందన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story