Fri Nov 22 2024 15:12:02 GMT+0000 (Coordinated Universal Time)
Governor : కొత్త గవర్నర్ రేవంత్‌కు సహకరిస్తారా? లేక..కేసీఆర్ హయాంలో మాదిరిగానే?
తెలంగాణకు రానున్న కొత్త గవర్నర్ ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది
తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నారు. ఇంకా ఎవరు అన్నది తెలియకున్నా.. తెలంగాణకు రానున్న కొత్త గవర్నర్ ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణతో గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా కూడా ఆమె రాజీనామా చేసి రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపిన తమిళి సై తమిళనాడుకు వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్త గవర్నర్ ను నియమించాల్సి ఉంది. అయితే కొత్త గవర్నర్ ఈ ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారన్నది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే తమిళి సై మాత్రం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించారనే అనుకోవాలి.
గత ప్రభుత్వంతో అమితుమీ అంటూ...
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, రాజ్‌భవన్ కు మధ్య అస్సలు పొసిగేది కాదు. కేసీఆర్ రాజ్‌భవన్‌కు కూడా అత్యవసర సమయాల్లో తప్ప వెళ్లే వారు కాదు. హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం సమయంలోనే ఆయన రాజ్‌భవన్ కు వెళ్లేవారు. ఇక మంత్రులు కూడా రాజ్‌భవన్ వైపు చూసేవారు కాదు. అప్పటి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగాన్ని కూడా లేకుండా కేసీఆర్ మరింత దూరాన్ని పెంచుకున్నారు. ఇక శానసమండలి సభ్యుల నియామకాల్లోనూ, వివిధ ఫైళ్లను ఆమోదించి పంపడంలోనూ ఆమె ఆలస్యం చేసే వారు. చివరి మంత్రి వర్గ సమావేశంలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించినా దానిని తిరస్కరించిన తమిళి సై తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన జాబితాను ఓకే చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం సత్సంబంధాలు...
రాజ్‌భవన్ తో రేవంత్ రెడ్డి కొంత సత్సంబంధాలు నడిపేవారు. గత ప్రభుత్వంలో తలెత్తిన ఇబ్బందులు రాకూడదని ఆయన తొలి నుంచి గవర్నర్ కు కొంత అనుకూలంగానే వ్యవహరించే వారు. గవర్నర్ కూడా పెద్దగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవారు కాదు. కానీ తమిళి సై సౌందర్ రాజన్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాని భావించి గవర్నర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో కొత్త గవర్నర్ నియామకం అనివార్యమయింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం... కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్. అందుకే కాంగ్రెస్ నేతల్లో కొంత బెరుకు... భయం పట్టుకుంది. పొరుగున ఉన్న తమిళనాడు తరహాలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే గవర్నర్ వస్తే ఎలా అన్న ఆందోళన మాత్రం ప్రభుత్వ పెద్దల్లో ఉంది.
కొత్త గవర్నర్ సహకరిస్తే సరి...
సహజంగానే కొత్తగా వచ్చే గవర్నర్ కొంత ప్రభుత్వానికి సహకరించకపోవచ్చన్న టాక్ మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎవరు వచ్చినా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందేనని కొంత సర్దిచెప్పుకున్నా.. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడం..తో పాటు కొర్రీలు వేయకుండా ఉండే గవర్నర్ రావాలని ప్రస్తుత ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే ఇక రాజకీయాలు ఎలా అవుతాయి? అందుకే రాజ్్భవన్, శాసనసభ మధ్య రానున్న కాలంలో ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొంత కాలం గడిస్తే కాని ఈ సందేహాలకు సమాధానం దొరకదు. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.
Next Story