Mon Dec 23 2024 00:09:58 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ..! వీరికే ఛాన్స్ ?
జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ..
టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లేది ఎవరనేది ఇప్పుడు ఆ పార్టీలో ఉత్కంఠ కలిగిస్తోంది. ఉన్నవి మూడు స్థానాలు కాగా పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. దీంతో, ఆశావహులంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే, అధినేత మనస్సులో ఎవరి పేర్లు ఉన్నాయనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. సామాజకవర్గ సమీకరణాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా ఈసారి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.
జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ ఈ అంశానికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో రాజకీయంగా ఉపయోగపడేవారిని, వివిధ పార్టీల నేతలతో సమన్వయం చేసుకోగలిగిన వారినే ఈసారి రాజ్యసభకు పంపించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి మొత్తం మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఇందులో ఒకటి బండ ప్రకాశ్ ముదిరాజ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానాన్ని ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. అయితే, ఈ స్థానానికి పదవీకాలం రెండేళ్ల కంటే తక్కువే ఉంది. కాబట్టి, బండ ప్రకాశ్ స్థానంలో రాజ్యసభకు వెళ్లడానికి పొంగులేటి అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు టీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నారు.
ఇక, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ పదవీకాలం జూన్ 21కి ముగుస్తోంది. వీరి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేదే ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే, ఈ రెండు స్థానాల్లో ఒకటి సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రకాశ్ రాజ్ కర్ణాటకకు చెందిన వారు. కానీ, తెలుగు ప్రజలతో, తెలంగాణతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడే ఒక గ్రామాన్ని సైతం దత్తత తీసుకున్నారు. కేసీఆర్ రాజకీయ ఆలోచనలతో ప్రకాశ్ రాజ్ ఆలోచనలు సరిగ్గా సరిపోయాయి.
అందుకే, ప్రకాశ్ రాజ్‌కు కేసీఆర్ మంచి ప్రాధాన్యత ఇస్తుంటూరు. ఇటీవల ఇతర రాష్ట్రాల టూర్‌కు వెళ్లినప్పుడు కూడా ప్రకాశ్ రాజ్‌ను కేసీఆర్ వెంటబెట్టుకొని వెళ్లారు. బీజేపీకి కూడా ప్రకాశ్ రాజ్ బద్ధవ్యతిరేకి. కాబట్టి, ఆయనను రాజ్యసభకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరో స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు ఉపయోగపడేలా కల్వకుంట్ల కవితకు కానీ, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌కు కానీ అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎస్సీ కోటాలో మోత్కుపల్లి నర్సింహులు, ఎస్టీ కోటాలో ప్రొ.సీతారాంనాయక్ రేసులో ఉన్నారు. మోత్కుపల్లికి మంచి పదవి ఇస్తానని గతంలో కేసీఆర్ మాటిచ్చారు. సీతారాంనాయక్ సిట్టింగ్ ఎంపీ అయినా గత ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఆయనకు కూడా న్యాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి, ఎవరి పేర్లను కేసీఆర్ ఖరారు చేస్తారో చూడాలి. చివరి నిమిషం వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది.
Next Story