Mon Dec 23 2024 18:57:09 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ 'గూగ్లీ' వికెట్ పడగొడుతుందా?
ప్రభుత్వ ఉద్యోగులంతా జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తున్న తరుణంలో బుధవారం నాటి కాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులను సంతృప్తి పరుస్తుందా?
జగన్ గూగ్లీ వికెట్ పడగొడుతుందా? ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లే లక్ష్యంగా బుధవారం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా సాగుతున్నాయి . సీపీఎస్ స్థానంలో గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, పీఆర్సీ బకాయిలు విడతల వారీగా విడుదల,12వ వేతన సవరణ నియామకం, డీఏల బకాయిల విడుదలపై హామీలు... ఇలా గత నాలుగేళ్లుగా పెండిరగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు పాజిటివ్‌గా స్పందిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నాడు జగన్ వెంటే
2019లో జగన్ ప్రభుత్వ అఖండ విజయంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా విస్మరించలేనిది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగులకు అనుకూలంగా ఉండేవి. రాజశేఖరరెడ్డి కూడా ఎప్పుడూ తన ప్రభుత్వాన్ని ఎంప్లాయీ ఫ్రెండ్లీగా పేర్కొనేవారు. జగన్‌పై కూడా అధిక శాతం మంది ఉద్యోగులకు సదభిప్రాయమే ఉండేది. తాను ముఖ్యమంత్రి కాగానే మాటిచ్చినట్లుగా మధ్యంతర భృతిని 27 శాతానికి పెంచారు జగన్. ఆ తర్వాత ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ ఏర్పడిరది. తమ ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపణలు మొదలు పెట్టారు. ఈ వివాదం 2022లో ఇచ్చిన పీఆర్సీతో మరింత ముదిరింది. మధ్యంతర భృతి కంటే ఫిట్మెంట్ తగ్గించి, బలవంతంగా వేతన సవరణ అమలు చేశారు. డీఏల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. డీఏ బకాయిల కింద ప్రతీ ఉద్యోగికి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు బాకీ ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడం, రాష్ట్ర విభజన కష్టాల వల్ల ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని ప్రభుత్వం అంటోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దుపై ఎప్పటికప్పుడు చర్చలు జరిగాయి కానీ ఫలితాలు రాలేదు.
పట్టభద్ర ఎన్నికల్లో ఝలక్
ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ మూడు స్థానాలను కోల్పోవడంతో తెలుగుదేశానికి కొత్త ఉత్సాహం వచ్చింది. ఉద్యోగులు, పట్టభద్రులు తమవైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమని నిర్ణయానికి వచ్చేసింది టీడీపీ. ఆ పార్టీ అనుకూల మీడియా అయితే మరో అడుగు ముందుకు వేసి మూడు ఎమ్మెల్సీ స్థానాల ఓట్లతో బేరీజు వేసుకుంటే తెలుగుదేశానికి కనీసం 110 స్థానాలు వస్తాయని ఢంకా భజాయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా బుధవారం జరిగిన మంత్రి మండలి భేటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మామూలుగానే వైసీపీ అనుకూల మీడియా ఉద్యోగులకు గొప్ప మేలు జరిగిందని రాయగా, టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా మాత్రం దగా అని ఆరోపించింది. తన పార్టీకి, ప్రభుత్వానికి దూరమైన ఉద్యోగ వర్గాన్ని దగ్గర చేసుకోవాలన్న లక్ష్యంతో జగన్ సంధించిన గూగ్లీ ఎంతమేరకు తన లక్ష్యాన్ని సాధిస్తుందో చూడాలి. చంద్రబాబు కూడా తన తదుపరి మ్యానిఫెస్టోలో ఉద్యోగులపై వరాల జల్లు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. 2024 ఎన్నికల్లో ఉద్యోగులు ఓట్లు కీలకంగా మారాయన్న మాట మాత్రం ఎవరూ కాదనలేని నిజం.
Next Story