మహారాష్ట్ర నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ?
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది తప్పా, ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది తప్పా, ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. మొదట్లో మహారాష్ట్ర వేదికగా పార్టీ విస్తరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత ఏపీ, ఒడిషాలకు స్టేట్ ఇంచార్జులను నియమించారు. అయితే అప్పటి నుంచి బీఆర్ఎస్లో ఎలాంటి కదలిక లేదు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ గులాబీ పార్టీని విస్తృత పర్చాల్సిన గులాబీ బాస్ సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. ఇక మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో మాత్రమే బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే దీని వెనుక అసలు కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియదు. కానీ.. కేసీఆర్ మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి సీఎం కేసిఆర్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేసి.. తెలంగాణలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని కూడా అనుకుంటున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ స్వయంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలిచి, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపేందుకు పలువురు రాజకీయ ప్రముఖులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. గతంలో కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ స్థానాల నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేశారు.
ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేయడం వల్ల అక్కడ పార్టీకి ఇమేజ్ పెరగడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మహారాష్ట్ర నుంచి పోటీ చేయడంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సర్వే సంస్థలతో కేసీఆర్ సర్వే చేయించుకున్నారని తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు పోటీ చేయడానికి ఎక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేదానిపై సర్వే రిపోర్టుల ద్వారా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. గతంలో చాలామంది అగ్ర నేతలు సైతం తమ సొంత రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. తమ పార్టీని వేరే రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేయడం, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉత్సాహం నింపేందుకు ఇలా నేతలు వేరే రాష్ట్రాల నుంచి పోటీ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన మార్క్ చూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.