టీడీపీ, జనసేన.. ఎవరిదారి వారిదేనా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలు, జనసేన నేతలకు పొత్తులపై క్లారిటీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలు, జనసేన నేతలకు పొత్తులపై క్లారిటీ లేదనే చర్చ సాగుతోంది. కలిసి పోటీ చేస్తామని చెబుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. పైగా టీడీపీ, జనసేన నేతలు వచ్చే ఎన్నికల్లో తమకే మెజారిటీ వస్తాయని చెప్పుకుంటున్నారు. దీంతో ఆయా పార్టీల కేడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. చంద్రబాబు నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తమ పార్టీకి 160 సీట్లకు తగ్గకుండా వస్తాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో పొత్తు సాధ్యమేనా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
పొత్తు కుదిరితే చంద్రబాబు నాయుడు సీఎం పదవి చేపట్టాలి. సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని ఆయన ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల జరిగిన మహానాడులో ఆయన ఇదే విషయాన్ని ప్రకటించారు. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థి, అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే జనసేన నుంచి విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్.. తాను ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. పొత్తు ఉంటే సీఎం పదవి పంచుకోవాలి. అయితే రెండు పార్టీల్లోని సందేహాలు వెలుగులోకి వచ్చినా అందుకు విరుద్ధంగా ప్రకటనలు వెలువడుతున్నాయి.
మరోవైపు ఇప్పటికిప్పుడే పొత్తు ప్రకటిస్తే క్యాడర్లో గందరగోళం నెలకొంటుందని ఇరు పార్టీలు ఆందోళనకు గురవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పట్లో పొత్తు లేకపోయినా.. ఎన్నికల ముందు చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అది సాధ్యం కాకపోతే, పార్టీలు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి, తమకు వచ్చిన సీట్ల ఆధారంగా అధికారాన్ని పంచుకోవచ్చు. ప్రజల మూడ్‌ని బట్టి రెండు పార్టీలు దీనిపై నిర్ణయం తీసుకుంటాయని అంటున్నారు పరిశీలకులు. అప్పటి వరకు ప్రశ్నలు, గందరగోళం మామూలే.