Sun Dec 22 2024 23:45:45 GMT+0000 (Coordinated Universal Time)
Prashanth Kishore : ఏపీలో పీకే వ్యూహం ఈసారి కూడా ఫలించేనా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికల వ్యూహాలను రచించడంలో ప్రశాంత్ కిషోర్‌ది అందెవేసిన చేయి. వ్యూహాలను రచించడంతోనే కాదు.. అభ్యర్థుల ఎంపికలోనూ... సోషల్ మీడియాలో ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో ప్రశాంత్ కిషోర్‌ను మించిన వారు లేరు. ఆయనకు ఎన్నికల సమయంలో అంత డిమాండ్ ఉంటుంది. ప్రతి పార్టీ ఆయనను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడానికి తహతహలాడుతుంది. ప్రశాంత్ కిషోర్ తమ కోసం పనిచేస్తారంటే కోట్లు కుమ్మరించేందుకైనా రాజకీయ పార్టీలు సిద్ధమవుతాయంటే ఆశ్చర్యం అనిపించక మానదు.
అందుకే అంత డిమాండ్...
ప్రశాంత్ కిషోర్ వరస సక్సెస్‌లు రావడంతోనే ఆయనకు పొలిటికల్‌గా అంత డిమాండ్ ఏర్పడింది. తన టీంను సకాలంలో దించడం అనేకసార్లు సర్వేలు చేయించడం, ఎక్కడ లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయడం... ప్రత్యర్థి బలహీనతలపై ప్రచారాన్ని విస్తృతంగా చేయడంతో పాటు అందుకు అనుగుణమైన ప్లాన్లను రూపొందించడంలో ప్రశాంత్ కిషోర్ కు మరెవ్వరూ సాటి రారు. అందుకే ఆయనను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంటే యాభై శాతానికి అధికారానికి దగ్గరయినట్లేనని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని రాజకీయ పార్టీల నేతలు ఆయనను నియమించుకుంటారు.
వరస సక్సెస్‌లతో...
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ను, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ ను , పశ్చిమ బెంగాల్ లో మూడోసారి మమత బెనర్జీని, ఢిల్లీలో హ్యట్రిక్ విక్టర్ కొట్టడంలో అరవింద్ కేజ్రీవాల్ కు ప్రశాంత్ కిషోర్ అండగా నిలిచారంటారు. యాభై శాతం వారి సొంత ఇమేజ్ కారణమయితే.. మరో యాభై శాతం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలని నమ్ముతారు. వరసగా అన్ని రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన పార్టీలన్నీ అధికారంలోకి రావడంతో ఆయనపై రాజకీయ పార్టీలకు మరింత నమ్మకం పెరిగింది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఆయన కోసం క్యూ కడుతున్నాయి. ఆయన ఉంటే చాలునన్న భావనతో ఉండటంతో ప్రశాంత్ కిషోర్ కు ఎప్పుటికీ రాజకీయంగా డిమాండ్ తగ్గదు.
తప్పేముంది?
తాజాగా ఏపీలో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడంతో ఈ విషయం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేసిన చంద్రబాబు అదే పీకేను స్ట్రాటజిస్టుగా నియమించుకోవడం ఆయన వైపు నుంచి చూస్తే కరెక్టే. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు అవసరం. ఇప్పుడు గెలవకుంటే ఇక పార్టీని నడపడం కూడా కష్టమే. పవన్ కల్యాణ్ తోడు ఉంటేనే సరిపోదు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా తనకు కావాలని చంద్రబాబు భావించడంలో తప్పు లేదు. అయితే పీకే వ్యూహాలు ఈసారి ఏ మేరకు పనిచేస్తాయన్నది చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.
Next Story