Fri Dec 20 2024 18:53:55 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఆ పార్టీ అక్కడ బోణీ కొడుతుందా? మరి ఆయనకు మళ్లీ విజయమేనా?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. ఈసారి గెలుపోటములపై అంచనా వేయడం కష్టమే
రాజకీయాల్లో హిస్టరీని ఎవరూ చెరపేయలేరు. అవి రికార్డులో పదిలంగానే ఉంటాయి. వాటిని ఎవరూ కాదనలేరు. కనిపించకుండా చేయను కూడా లేరు. ఇది వాస్తవం. ఒక్కోసారి రాజకీయాల్లో విచిత్రమైన ఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు సింహపురిలో సీన్ కనిపిస్తుంది. నెల్లూరు రూరల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇద్దరూ ఉద్దండులే. రెండు పార్టీలూ సమఉజ్జీలే. అయితే రికార్డులను చూస్తే మాత్రం ఎవరిది గెలుపు అన్నది మాత్రం స్పష్టత రాకుండా ఉంది. అందుకే త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇప్పుడు అందరి నోళ్లలో నానుతుంది.
మిక్స్డ్ ప్రాంతం కావడంతో...
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 2009 లో నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా ఏర్పడింది. పేరుకు నెల్లూరు రూరల్ అయినా దాదాపు ముప్పాతిక భాగం నగరంలోనే ఉంటుంది. అందుకే దీనిని రూరల్ అని వన్ సైడ్ గా చెప్పలేం. పట్టణ ప్రజలు కూడా ఎక్కువగా ఈనియోజకవర్గంలో భాగస్వామ్యులై ఉంటారు. అందుకే కార్పొరేషన్ లో ఎక్కువ భాగం రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. అందుకని ఇక్కడ ఏ పార్టీ గెలుపోటములను ముందుగా అంచనా వేయలేం. గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా, పట్టణ ప్రాంతాల్లో మరొకలా ఓటరు నాడి ఉండే అవకాశముంది. కానీ ఈ నియోజకవర్గం మిక్స్డ్ గా ఉండటంతో ఇక్కడ ఎవరిది గెలుపు అన్నది ఈవీఎంలు తెరిచేంత వరకూ చెప్పలేం.
గెలవని నియోజకవర్గంలో...
అయితే గత గణాంకాలు చూస్తే ఇక్కడ టీడీపీ అనేది విజయం సాధించలేదు. బోణీ కూడా కొట్టలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అప్పుుడు ప్రజారాజ్యం రెండో స్థానంలో నిలిచింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా టీడీపీ మిత్ర పక్షం గెలవలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది. ఇక్కడ సైకిల్ గుర్తు అస్సలు గెలవలేదు. కానీ ఈ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కావడంతో ఈసారి పసుపు జెండా ఎగురుతుందన్న నమ్మకంగా ఉంది. జనసేన, టీడీపీ పొత్తు ఉండటంతో పాటు కోటంరెడ్డికి వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉండటంతో ఆయన తన గెలుపుపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. తాను జనంలోనే ఉంటాను కాబట్టి రూరల్ ప్రజలు తనకు హ్యాట్రిక్ విజయం కట్టబెడతారని అనుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపి నుంచి గెలిచిన కోటంరెడ్డి ఈసారి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు.
ఓటమి ఎరుగని...
కానీ నెల్లూరు రూరల్ లో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం, తొలి నుంచి పట్టున్న ప్రాంతం కావడంతో ఈసారి కూడా గెలవాలని వైసీపీ భావిస్తుంది. అందుకే ఏరికోరి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నియమించింది. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇప్పటి వరకూ ఓటమి అంటూ లేదు. ఆయన 1999 నుంచి ప్రతి ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తూ వస్తూనే ఉన్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఆదాలకు దిట్టగా పేరుంది. అంతే కాదు సౌమ్యుడు కూడా. అందరినీ కలుపుకుని పోయే నేత కావడంతో వైసీపీ ఆయనను రంగంలోకి దించుతుంది. దీంతో ఎవరు ఓడినా రికార్డే. ఎవరు గెలిచినా అది హిస్టరీలో చోటు సంపాదించుకుంటుంది. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంపైనే ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఉంది.
Next Story