Sat Nov 23 2024 00:29:06 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : మారిస్తేనే మళ్లీ అధికారమా..? సర్వేలు అవే చెప్పాయా?
వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎలాగైనా మరోసారి గెలవాలని భావిస్తున్నారు. అందుకోసం ఎడా పెడా అభ్యర్థులను మార్చేస్తున్నారు
వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎలాగైనా మరోసారి గెలవాలని భావిస్తున్నారు. అందుకోసం ఎడా పెడా అభ్యర్థులను మార్చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరొక చోటికి మారుస్తున్నారు. కొందరికి టిక్కెట్లను కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుతున్న సర్వేల ప్రకారం అభ్యర్థులను మార్చేసి జగన్ రెండోసారి గెలవాలని భావిస్తున్నారు. అందుకోసం ఎవరినీ లెక్క చేయడం లేదు. జగన్ అందరికీ ముందుగానే చెప్పారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న జగన్ ఈసారి గెలిచి రాజకీయంగా ప్రత్యర్థులపై పై చేయి సాధించాలని భావిస్తున్నారు. అయితే గెలవాలంటే అభ్యర్థులను మారిస్తేనే సాధ్యమా? అన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతోంది.
మార్చేస్తుండటంతో...
వరసగా ఎమ్మెల్యేలను మారుస్తూ కొందరికి సీట్లు ఇవ్వకపోతుండటంతో అందరి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇందులో జగన్ ఏ మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని చెబుతున్నారు. అందుకే ముందుగానే ఎమ్మెల్యేలను పిలిపించి తాను ఎందుకు టిక్కెట్లు ఇవ్వలేకపోతున్న విషయం చెబుతున్నారు. అయితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మరో కీలకమైన పదవి ఇస్తామని భరోసా ఇస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయనకు మాత్రం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేనని జగన్ చెప్పేశారంటున్నారు. మరికొందరికి ఎమ్మెల్సీ పోస్టులను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చిన నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్థులకు సహకరిస్తారన్న గ్యారంటీ లేదు. తమ నియోజకవర్గంలో వేరే వారు గెలిచేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు?
తమ దారి తాము...
దీంతో కొందరు నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు కూడా ఈసారి టిక్కెట్ ఇవ్వలేమని చెప్పడంతో ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి టిక్కెట్ ఇవ్వలేదని చెప్పడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశఆరు. నేతలు వెళ్లిపోయినా సరే తాను మాత్రం అనుకున్న పద్థతిలోనే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి బలంగా ఉండటంతో గెలుపు గుర్రాలనే నిలపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తనకు వివిధ రూపాల్లో అందిన సర్వే నివేదికలను అనుసరించి జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు. వారికి వేరే దారి లేకపోవడంతో ఇక జగన్ చెప్పినట్లే వినాల్సిన పరిస్థితులు అత్యధిక మందిలో ఉన్నాయి.
జనం మాత్రం..?
అయితే అభ్యర్థులను మార్చినంత మాత్రాన గెలుస్తారా? అంటే ఖచ్చితమని చెప్పలేం. ఎందుకంటే ఎన్నికలంటే అభ్యర్థులను చూడరు. టోటల్ గా పాలనను చూస్తారు. మ్యానిఫేస్టోను పరికిస్తారు. గత, ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తారు. అన్నింటినీ నిశితంగా గమనించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. స్థానిక ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు. కానీ ఓవర్ ఆల్ గా చూసేది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకే జనం జై కొడతారు. అది జగన్ కావచ్చు. లేదా చంద్రబాబు కూటమి కావచ్చు. జగన్ ఎన్నికలకు ముందు డిసైడ్ అవుతారు తప్పించి... అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఐదు శాతం ఓట్లు మారతాయే తప్ప పూర్తి స్థాయి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేదన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద అభ్యర్థుల మార్పుపై మాత్రం వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చివరకు ఏం జరుగుతుందన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Next Story