Sun Dec 22 2024 08:03:17 GMT+0000 (Coordinated Universal Time)
Narasapuram : రాజు గారికి చెక్... మామూలు స్థాయిలో లేదుగా.. అలా అయితే చెమటోడ్చాల్సిందే
నరసాపురం నుంచి ఈసారి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని పోటీ చేయించాలని వైసీపీ భావిస్తుంది
నరసాపురం ప్రస్తుత వైసీపీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు మళ్లీ పోటీ చేస్తానని చెబుతున్నారు. ఏ పార్టీ అన్నది ఇంకా తేలకున్నా తాను పోటీ చేయడం ఖాయమని దమ్ముంటే తనను ఓడించాలంటూ సవాల్ పై సవాల్ ను కూడా విసురుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల సొంత నియోజకవర్గానికి సంక్రాంతి పండగ కోసం వచ్చిన రఘురామ కృష్ణరాజు తన సన్నిహితులతో సమావేశమయ్యారట. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారట. అందుకు జనసేన కూడా అంగీకరిస్తుందని ఆయన చెప్పారు. రఘురామ కృష్ణరాజుకు స్వాగతం పలికిన వారిలో జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం.
పెద్ద ప్లాన్ లోనే...
అయితే నరసాపురంలో రఘురామ కృష్ణరాజును ఓడించేందుకు వైసీపీ పెద్ద ప్లాన్ లో ఉంది. రాజుగారికి చెమటలు పడ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువగా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2004లో మాత్రం చేగొండి హరిరామ జోగయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతకు ముందు 1996లో టీడీపీ నుంచి కొత్త పల్లి సుబ్బారాయుడు ఎంపీగా గెలిచారు. అయితే 2009 నుంచి వరసగా క్షత్రియ సామాజికవర్గం వారే ఎన్నికవుతూ వస్తున్నారు. వారికే రాజకీయ పార్టీలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి. టిక్కెట్లు కూడా వారికే కేటాయిస్తూ వస్తుండటంతో వారిదే విజయం.
టీడీపీ నుంచి...
1996 ఎన్నికల తర్వాత ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు. అందుకే ఈసారి ఈ ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైగా జనసేన తో పొత్తు ఉండటంతో గెలుపు సులువవుతుందని అంచనా వేస్తుంది. అయితే గెలుపు అనేది అంత సులువు కాదని వైసీపీ గట్టి సంకేతాలను పంపుతుంది. సినీనటుడు దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని వైసీపీ నరసాపురం అభ్యర్థిగా బరిలోకి దింపాలని డిసైడ్ చేసిందట ఫ్యాన్ పార్టీ. ఆమె కనుక బరిలో ఉంటే యువత ఓట్లు కూడా ఇక ఫ్యాన్ పార్టీపై పడతాయి. పార్లమెంటులోనే కాదు.. దాని నియోజకవర్గ పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపుతుందని అంచానాలు వినపడుతున్నాయి.
ప్రభాస్ ఫ్యాన్స్ కూడా...
కృష్ణంరాజు 1999లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యారు. క్షత్రియ ఓటు బ్యాంకుతో పాటు ఆయన సోదరుడు కుమారుడు సినీ హీరో ప్రభాస్ ప్రచారం చేయకపోయినా ఆయన ఫ్యాన్స్ మొత్తం శ్యామలాదేవి వెంట నడుస్తారనడంలో సందేహం లేదు. క్షత్రియ సామాజికవర్గంలో కృష్ణంరాజుకు ఉన్న పేరు ప్రతిష్టలు అదనపు బలం చేకూరుస్తాయంటారు. అప్పుడు శ్యామలాదేవి గెలుపు ఈజీగా మారుతుందని ఫ్యాన్ పార్టీ నేతలు గట్టిగా భావిస్తున్నారు. శ్యామలాదేవిని పోటీకి ఒప్పించేందుకు ఆ జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. అలా రఘురామ కృష్ణరాజుకు కృష్ణంరాజు సతీమణితో చెక్ పెట్టాలన్న యోచనలో వైసీపీ ఉంది. మరి శ్యామలాదేవి బరిలో ఉంటే రాజుగారికి చుక్కలు కనిపించినట్లేనని నరసాపురం టాక్.
Next Story