Sun Jan 12 2025 00:02:27 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : శంఖం పూరించడం కాదు... గెలవడం ఎలా చూసుకో బాసూ?
వైసీపీ అధినేత జగన్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కొరుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా రెండు నెలల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో అన్ని పార్టీలూ ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే ఈసారి ఏపీలో గెలుపు ఎవరది అన్న చర్చ మొదలయింది. గ్రామాల్లో తమకు పట్టుందని వైసీపీ గట్టిగా భావిస్తుంది. పట్టణాల్లో మాత్రం కొంత శ్రమించాలని అనుకుంటోంది. పట్టణంలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం కష్టమేనని అంటున్నాయి అనేక సర్వేలు. వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలిచే స్థానాల్లో ఎక్కువగా రూరల్ ఏరియా నుంచే ఉంటాయన్నది కూడా పలు రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. పట్టణాల్లో అభివృద్ధి జరగకపోవడంతో వివిధ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా మారనుందన్న కామెంట్స్ కూడా బలంగా వినపడుతున్నాయి.
ఉద్యోగులు మాత్రం వ్యతిరేకంగానే...
ముఖ్యంగా ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది. ఉపాధ్యాయుల మొదలు కొని అన్ని శాఖల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీతాలు ఒకటో తేదీన రాకపోవడంతో పాటు రావాల్సిన ప్రయోజనాలు కూడా అందకపోవడం వారి అసంతృప్తికి ప్రధాన కారణం. తమ ప్రయోజనాలను పక్కన పెట్టి, వాటి గురించి పట్టించుకోకుండా సంక్షేమ పథకాలకు పంచి పెడుతుండటాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కాకుండా వాలంటరీ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి పై ఆదాయం కూడా తగ్గిందన్నది ప్రభుత్వ శాఖల్లో కొందరి అక్కసుగా ఉంది. రేషన్ కార్డు నుంచి పింఛను, సంక్షేమ పథకాల ఎంపిక వంటి వాటిలో తమకు సంబంధం లేకుండా జరిగిపోతుండటం కూడా ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు.
పన్నుల భారం పెరిగి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో సమస్యలు పెరిగిపోయాయి. కొన్ని నగరాల్లో రహదారులు కూడా సక్రమంగా లేకపోవడంతో పాటు మురుగునీటి సమస్య.. దీనికి అదనంగా విద్యుత్తు ఛార్జీలతో పాటు ఇంటి పన్ను.. చెత్త పన్ను అంటూ వసూళ్లకు దిగడంపైన కూడా కొన్ని వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. పన్నులు, ఛార్జీలు పెంచి తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని పేదలకు పంచిపెట్టడమేంటన్న ప్రశ్నను కొందరు నేరుగానే సంధిస్తున్నారు. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమంతోనే రాష్ట్రంలో పాలన సాగితే రానున్న కాలంలో తలసరి రుణభారం ఎంత పడుతుందో తెలియదా? అని మేధావి వర్గాలు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నాయన్న సంకేతాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అయినా జగన్ ఇవేమీ పట్టించుకోకుండా తాను చెప్పిన పద్ధతిలోనే బటన్ నొక్కుతూ వెళుతున్నారు.
యువత పూర్తిగా...
మరో ముఖ్యమైనది యువత. నిరుద్యోగం పెరిగిపోవడం, ఉపాధి అవకాశాలు పూర్తిగా కన్పించకపోవడంతో యువత ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా చేరిన యువ ఓటర్లు కూడా దాదాపు ఏడు లక్షల ఓటర్లున్నట్లు అంచనా. వీరంతా వ్యతిరేకమైతే ఫ్యాన్ పార్టీకి కష్టాలేనని అంటున్నారు. అందుకే జగన్ సిద్ధం అని శంఖారావం పూరించడానికి బదులు గెలవడానికి అవసరమైన చర్యలకు దిగాలని పార్టీ నేతలు కోరుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలు అందుకున్న లబ్దిదారులు ఓటు వేసినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేదన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నదే. అందుకే నోటిఫికేషన్ వెలువడే ముందే అసంతృప్తిగా ఉన్న సామాజికవర్గాలపై ఫోకస్ పెట్టాలన్నది సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తుంది. మరి జగన్ ఆ వైపు ఆలోచిస్తారా? ఎన్నికలకు ముందే జనం మెచ్చే నిర్ణయాలు తీసుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story