Sat Nov 16 2024 12:42:44 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నాలుగో లిస్ట్ కోసం కసరత్తులు... ఈరోజు నుంచి మళ్లీ పిలుపులు
సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన వైసీపీ అధినాయకత్వం మళ్లీ కసరత్తులు ప్రారంభించింది.
సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన వైసీపీ అధినాయకత్వం మళ్లీ కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ 59 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. సిట్టింగ్ లు దాదాపు 20 మందికిపైగానే సీట్లు గల్లంతయ్యాయి. వారికి నామినేెటెడ్ పదవులు ఇస్తామని కొందరికి చెప్పినా, మరికొందరు పార్టీని వీడి వెళ్లిపోయారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు పార్టీకి రాజీనామాలు చేశారు. కర్నూలు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు సంజీవ్ కుమార్, బాలశౌరిలు కూడా రాజీనామా చేశారు.
పార్లమెంటు స్థానాల్లో...
ఈ నేపథ్యంలో నాలుగో లిస్ట్ లో ఎవరు ఉంటారన్న దానిపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కడప పార్లమెంటు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా పక్కకు తప్పించే అవకాశాలున్నాయని తెలిసింది. అలాగే రాజమండ్రి, అనకాపల్లి, విజయనగరం, మచిలీపట్నం, నరసాపురం, గుంటూరు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈరోజు జరిపే చర్చలతో కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపించడంతో ఆయనను తప్పించి ఆ స్థానంలో ఎవరికి అవకాశమివ్వాలన్న దానిపై కసరత్తు జరుగుతుంది. వైఎస్ కుటుంబానికే ఆ పదవి ఇస్తారా? లేదా మైనారిటీలను బరిలోకి దింపుతారా? అన్నది తేలాల్సి ఉంది.
సామాజికవర్గాల వారీగా...
అలాగే అనేక శాసనసభ నియోజకవర్గాల్లోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశముంది. అయితే నాలుగో జాబితాలో మాత్రం స్వల్పంగానే మార్పులు ఉంటాయని చెబుతున్నప్పటికీ చివరి నిమిషంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఎవరికి పిలుపు వస్తుందా? అన్న టెన్షన్ నెలకొంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఐ ప్యాక్ టీం ఇచ్చిన నివేదికతో పాటు ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన రిపోర్టులు కూడా ఈ మార్పులు చేర్పులు కీలకంగా మారనున్నాయి. సామాజికవర్గాల వారీగా బేరీజు వేసుకుని బీసీలకు అత్యధికంగా స్థానాలు ఇచ్చే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి.
Next Story