టార్గెట్ టీడీపీ కాదు.. జనసేన అంటోన్న వైసీపీ
వైసీపీ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. అధికారంలో వచ్చినప్పటీ నుండి టీడీపీపై విమర్శలు గుప్పించిన వైసీపీ.. ఇప్పుడు జనసేనను టార్గెట్ చేసింది.
వైసీపీ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. అధికారంలో వచ్చినప్పటీ నుండి టీడీపీపై విమర్శలు గుప్పించిన వైసీపీ.. ఇప్పుడు జనసేనను టార్గెట్ చేసింది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విమర్శల వర్షం కురిపిస్తోంది. వైసీపీ బద్ధ శత్రువైనా టీడీపీని కాదని, జనసేనను లక్ష్యంగా చేసుకోవడం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్..ఇలా ఎవరికి వారు పవన్‌పై విమర్శలు చేయడం మనం ఇప్పటి వరకూ చూశాం. అయితే ఇటీవల కురుపాం జరిగిన సభలో సీఎం జగన్.. పవన్ కల్యాణ్‌పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
పవన్ మాట తీరు, పవన్ పెళ్లిళ్ల వ్యవహారం, ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు.. ఇలా ప్రతీదానిపై సీఎం జగన్ ఘాటుగా మాట్లాడారు. ఇక అంతే స్థాయిలో పవన్ కూడా స్పందించారు. అయితే అధికార వైసీపీ.. జనసేనను టార్గెట్ చేయడం వెనుక ఎదో ఎత్తుగడ ఉన్నట్టు అనిపిస్తోంది. నాలుగేళ్లుగా టీడీపీపై ఫోకస్ పెట్టిన వైసీపీ.. ఇప్పుడు జనసేనను టార్గెట్ చేయడం వెనక రాజకీయ ఎత్తుగడ ఉందని రాజకీయ విశ్లేషనకులు అంటున్నారు. మొదట్లో టీడీపీ, జనసేన కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని భావించిన వైసీపీ.. దమ్ముంటే విడివిడిగా పోటీ చేయాలని టీడీపీ, జనసేనలకు సవాల్ విసిరింది.
చంద్రబాబుతో పవన్ సన్నిహితంగా ఉండటంతో అతడిని దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ కామెంట్లు చేసింది. జనసేనను టీడీపీ పెంచి పోషిస్తోందని వైసీపీ ఎద్దేవా చేసింది. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన ఎవరికి వారుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో వైసీపీ ఆలోచనలో పడింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసా, విడివిడిగా పోటీ చేస్తాయా అనే సందేహం కలుగుతోంది. జగన్ తన దృష్టిని అంతా పవన్ కళ్యాణ్ వైపు మళ్ళించడం ద్వారా టీడీపీ ఓట్లు చీల్చి అవి పవన్ వైపు మళ్ళేలా చేయాలని వ్యూహం పన్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే తన గెలుపు మరింత సునాయసం అవుతుందనేది జగన్ ప్లాన్‌గా కనిపిస్తోంది.