Fri Nov 22 2024 21:08:20 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకూ.. ఇన్ని మార్పులా..?
వైఎస్ జగన్ పార్లమెంటు సభ్యులందరినీ దాదాపు మార్చేస్తున్నారు. అన్ని చోట్ల కొత్త అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు
సహజంగా ఏ పార్టీ అయినా పార్లమెంటు సభ్యుల విషయంలో పెద్దగా పట్టించుకోరు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రెండూ ఒకేసారి జరుగుతుండటంతో పార్లమెంటు సభ్యుల విషయంలో రాజకీయ పార్టీలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. కాకుంటే కాస్త కాసులున్న వారిని ఎంపిక చేసి శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎన్నికల వేళ నిధులను సర్దుబాటు చేస్తారని గతంలో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఇప్పడు అలా కనిపించడం లేదు. వైసీపీ అధినాయకత్వం మార్పులు, చేర్పులు చూస్తుంటే... కేవలం శాసనసభ స్థానాలే కాదు.. ఎంపీ స్థానాల్లోనూ భారీ మార్పులు చేసింది.
సహజంగా....
ఎందుకో మరి పార్లమెంటు సభ్యుల విషయంలో జగన్ ఇంత పట్టుపడుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సహజంగా ప్రజలు కూడా పార్లమెంటు సభ్యులను పట్టించుకోరు. క్రాస్ ఓటింగ్ ఎలాగూ జరగదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారో లోక్సభ ఎన్నికల్లోనూ వారికే ఓటు వేస్తారన్న అంచనాలు ఉంటాయి. పార్లమెంటు సభ్యులను గత కొంతకాలంగా ఇటు టీడీపీ, అటు వైసీపీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేంద్రంలో పదేళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉండటంతో ఇక్కడ గెలిచిన రెండు పార్టీలూ అక్కడ మాత్రం బీజేపీకే మద్దతు ఇస్తూ వస్తున్నాయి. కానీ వైసీపీ ఈసారి పార్లమెంటు ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. దాదాపు అత్యధిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింంది.
మార్పులు చేస్తూ...
తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తిని అక్కడి నుంచి తప్పించి సత్యవేడు శాసనసభకు పంపింది. అక్కడ కోనేటి ఆదిమూలంను ఇన్ఛార్జిగా నియమించింది. చిత్తూరు పార్లమెంటు సభ్యుడు రెడ్డప్పను గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానానికి పంపింది. చిత్తూరు పార్లమెంటుకు ప్రస్తుత మంత్రి నారాయణస్వామిని ఎంపిక చేసింది. నెల్లూరు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించింది. నరసరావుపేట లోక్సభ స్థానానికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో నాగార్జున యాదవ్కు టిక్కెట్ ఇస్తారంటున్నారు. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లడంతో కొత్త అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
కొన్ని చోట్ల మాత్రం...
విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వచ్చిన కేశినేని నానికి జగన్ టిక్కెట్ ఇచ్చారు. ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్ కు కాకుండా ఆయన స్థానంలో కారుమూరి సునీల్ కుమార్కు ఇన్ఛార్జి పదవి ఇచ్చారు. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో అక్కడ పెండెం దొరబాబు కాని, చలమలశెట్టి సునీల్ కుమార్ కు టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను అసెంబ్లీ సీటు కేటాయించారు. అక్కడ కొత్త వ్యక్తిని ఎంపిక చేయాల్సి ఉంది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్థానంలో కొత్త వారికి టిక్కెట్ ఇవ్వాల్సి ఉంది. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీఎస్ సత్యనారాయణ స్థానంలో బొత్స ఝాన్సీని నియమించారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో పేరాడ తిలక్ ను ఇన్ఛార్జిగా నియమించారు.
వీరి స్థానంలో...
అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్యను కల్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన జగన్ మాజీ మంత్రి శంకరనారాయణను అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ స్థానంలో శాంతమ్మకు చోటిచ్చారు. కర్నూలు లోక్ సభ నుంచి సంజీవ్ కుమార్ ను కాదని ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరి జయరాంను నియమించారు. అరకు పార్లమెంటు నుంచి గొడ్డేటి మాధవి స్థానంలో పాడేరు వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని నియమించారు. ఇక ఒంగోలు, గుంటూరు, కడప, రాజంపేట, నంద్యాల, బాపట్ల వంటి చోట్ల మాత్రం ఇంకా మార్పులు జరగలేదు. ఒంగోలు ఎంపీ మాగుంట స్థానంలో చెవిరెడ్డికి చోటు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీదచూస్తే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటికే పదిహేను స్థానాలకు పైగా అభ్యర్థులను మార్చారు. దీనిపై పార్టీలో చర్చ జరుగుతుంది.
Next Story