Fri Nov 22 2024 19:40:46 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వైసీపీలో ఆ యువ ఎమ్మెల్యేకు టిక్కెట్ గల్లంతేనా...హాట్ టాపిక్
వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇన్ ఛార్జులను మార్చేస్తున్నారు. యువ ఎమ్మెల్యేకు టిక్కెట్ కష్టమేనంటున్నారు
వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇన్ ఛార్జులను మార్చేస్తున్నారు. సీనియర్లు.. జూనియర్లు అనే తేడా లేదు. గెలుపు అవకాశం లేని వారిని పక్కనపెట్టేందుకే డిసైడ్ అయ్యారు. కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు. దీంతో అనేక మంది ఊహించని పేర్లు కూడా జాబితాలో కనిపిస్తుండటం, సీట్లు గల్లంతవుతుండటం ఆశ్చర్యం కలుగుతుంది. పార్టీకి చేసిన సేవలను గుర్తుంచుకుని కొందరికి పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు. అలాగే మరికొందరిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. తనవాడు.. పరాయి వాడన్న బేధమేమీ లేదు. సర్వేలను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
యువ ఎమ్మెల్యేకు...
ఈ నేపథ్యంలో మరో యువనేతకు సీటు చిరిగిపోతుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం వెలువడనప్పటికీ 90 శాతం సీటు దక్కకపోవచ్చన్న ఊహాగానాలు తాడేపల్లి నుంచి వినిపిస్తున్నాయి. ఆయనే కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే షఫీజ్ ఖాన్ పై వేటు పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. ఆయన కర్నూలు శాసనసభ నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయనపై పెద్దగా ఆరోపణలు, వ్యతిరేకత లేనప్పటికీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా హఫీజ్ ఖాన్ ను పక్కన పెడతారన్న టాక్ వినపడుతుంది. అయితే కడప సీటుకు.. కర్నూలు సీటుకు లంకె ఉందని చెబుతున్న వారు కూడా ఉన్నారు.
కొత్తవారికి ఇన్ ఛార్జులుగా...
ఇప్పటికే నలుగురు మైనారిటీలను నియోజకరవర్గాలకు ఇన్ ఛార్జులుగా నియమించారు. అంటే వచ్చే ఎన్నికల్లో నలుగురు మైనారిటీలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మదనపల్లి నుంచి నిస్సార్ అహ్మద్, కదిరి నుంచి మక్బూల్ అహ్మద్, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి షేక్ నూరి ఫాతిమా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం షేక్ ఆసిఫ్ పేర్లను వైసీపీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఇక కడప శాసనసభకు అంజాద్ భాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన తప్పిస్తారా? లేదా? అన్నది కూడా కొంత చర్చ జరుగుతోంది. ఆయనను తప్పించకపోతే హఫీజ్ ఖాన్ పై వేటు పడినట్లే.
ఐదుగురికి ఇవ్వడంతో...
అంజాద్ భాషాతో కలిపి అప్పటికే ఐదుగురు మైనారిటీలకు టిక్కెట్లు ఇచ్చినట్లవుతుంది. అందుకే హఫీజ్ ఖాన్ ను తప్పించి ఆయన స్థానంలో మరొక నేతకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఎస్వీ మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. అందుకే హఫీజ్ ఖాన్ రాజకీయ భవిష్యత్ ఊగిసలాటలోనే ఉంది. తర్వాత జాబితాలో ఆయన పేరు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందుకే హఫీజ్ ఖాన్ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఎప్పుుడు పిలుపు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఐదుగురు మైనారిటీలకు టిక్కెట్లు ఇవ్వడం, సీమలో ముగ్గురు మైనారిటీలకు సీట్లు ఖరారు కావడంతో హఫీజ్ ఖాన్ సీటు హుష్ కాకి అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story