Fri Nov 15 2024 20:51:29 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : "బలగం"తో మమేకం... విజయం కోసం జగన్ తొలి అడుగు
పార్టీ క్యాడర్ తో జగన్ భీమిలీలో తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు వారిని సిద్ధం చేస్తున్నారు
సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి అయినా క్యాడర్ ముఖ్యం. క్యాడర్ పటిష్టంగా ఉన్నప్పుడే పార్టీ విజయం దిశగా నాలుగు అడుగులు ముందు ఉంటుంది. క్యాడర్ లో నైరాశ్యం, అసహనం ఉంటే ఆ పార్టీ కోలుకోనుకూడా కోలుకోలేదు. అందుకే నేతలు ఎవరైనా వారి వారి స్థాయిలో క్యాడర్ ను ఎప్పటికప్పడు ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధం అవుతుంటారు. ఓటర్లను ఆకట్టుకోవడం కంటే క్యాడర్ ను ఉత్సాహపర్చడమే రాజకీయ నేతలకు అతిపెద్ద సవాల్. అందుకే వైసీపీ అధినేత జగన్ నేడు కార్యకర్తలతో సమావేశం అవతున్నారు. కేడర్ తో మమేకమై తానున్నానంటూ వారికి భరోసా ఇవ్వనున్నారు. వారి మనసులో మెదులుతున్న అనేక సందేహాలకు కూడా జగన్ ఎండ్ కార్డు వేయనున్నారు.
భీమిలీలో తొలి సభ....
తొలి సభను "సిద్ధం" పేరుతో విశాఖ జిల్లా భీమిలో వైసీపీ కార్యకర్తలతో అతి పెద్ద సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి వైసీపీ అధినేత జగన్ హాజరు అవుతున్నారు. ఈ సభ నుంచే జగన్ 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. భీమిలీ నియోజకవర్గంలోని సంగివలసలో ఏర్పాటు చేసిన భారీ ప్రాంగణంలో తొలి సభ జరగనుంది. ఆయన కార్యకర్తలందరితో మమేకమవుతున్నారు. వారి సమస్యలతో పాటు పార్టీ, ప్రభుత్వం, నేతల పట్ల వారికి ఉన్న ఒపీనియన్లను స్వయంగా అడిగి తెలుసుకునే కార్యక్రమమిది. వచ్చే ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేయడంపై తొలుత వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది.
అందరూ ఒక్కటై....
ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం స్థానికంగా చెప్పగలిగేది క్యాడరే. అలాగే సంక్షేమ పథకాల్లో ఏ మాత్రం నియోజకవర్గంలో అవినీతి జరిగినా దానికి స్పందించేది కూడా వారే. అందుకే జగన్ తొలుత అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అందరూ ఒక్కటై తమపై చేస్తున్న పోరాటాన్ని ఎలా ఎదుర్కొనాలో చెప్పనున్నారు. భయపడాల్సిన పనిలేదని, ప్రజలు మనవెంటే ఉన్నారని, వారిని పోలింగ్ బూత్లకు వెళ్లి తీసుకెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించడమే మన పని అన్నది జగన్ వారికి ఉద్భోధించనున్నారు. వారిలో జోష్ నింపనున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి...
ఉత్తరాంధ్ర నుంచి వరసగా బయలుదేరి అన్ని ప్రాంతాల్లో ఈ రకమైన సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. తొలి సభ నేడు జరగనుంది. ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు తెలియచేయడంతో పాటు విపక్షాలు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించే దిశగా క్యాడర్ ను సిద్ధం చేయనున్నారు. నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వచ్చిందో కూడా జగన్ ఈ సందర్భంగా క్యాడర్ కు వివరించనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారికి తాను ఏరకంగా ఉపయోగపడతానన్న విషయాన్ని కూడా స్పష్టం చేయనున్న ఈ సమావేశం వైసీపీకి అత్యంత కీలకంగా మారనుంది. ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల నుంచి ఈ సమావేశానికి క్యాడర్ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story