Mon Dec 23 2024 11:38:07 GMT+0000 (Coordinated Universal Time)
Ys Vijayamma : కొడుకు వైపా...? కుమార్తె తో నడుస్తారా? విజయమ్మకు ఇబ్బందికరమే
వైఎస్ విజయమ్మ ఇప్పడు సందిగ్దంలో పడ్డారు. కుమారుడు, కుమార్తెల రాజకీయాల మధ్య ఆమె నలిగిపోతున్నారు
అవును.. ఏ తల్లికయినా బిడ్డలు అందరూ సమానమే. అందులో ఇద్దరుంటే రెండు కళ్లలా భావిస్తారు. తండ్రి అయితే మందలించే స్థాయిలో ఉంటారు. కానీ తల్లి ఆ పనిచేయలేదు. కళ్లతోనో... సైగలతోనూ.. తన భావాలను వ్యక్తం చేయని నిస్సాహయ స్థితి తల్లిది. ఎటువైపు అంటే ఎటూ తేల్చుకోలేరు. ఇద్దరూ తన బిడ్డలే. ఎవరిని కాదనుకుంటారు. ఎవరిని కౌగిలించుకుంటారు. ఏ తల్లికీ రాని సంకట స్థితి ఇప్పుడు వైఎస్ విజయమ్మకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కొన్ని విషయాల్లో నచ్చ చెప్పి ఉండవచ్చు. భర్త కాబట్టి ఆ మాత్రం ధైర్యం చేసి ఉండవచ్చు. కానీ కొడుకు, కుమార్తెలకు మాత్రం ఆమె ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నట్లే కనపడుతుంది.
జగన్ గెలవాలంటూ...
ఒకవైపు కుమారుడు వైఎస్ జగన్ పదహారు నెలల పాటు జైలులో ఉండి పాదయాత్ర చేసి మరీ అధికారంలోకి వచ్చారు. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నాడు. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని విజయమ్మ గతంలో కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లో ఉండి ఉంటే తన కుమారుడు జగన్ పై ఎటువంటి కేసులుండేవి కావని కూడా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారంటూ ఆయన అక్రమాస్తులపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అలాంటి కుమారుడు జగన్ ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కొనబోతున్నారు. కుమారుడికి అండగా నిలవాల్సిన ధర్మం తల్లిగా విజయమ్మకు ఉంటుందన్న వాదన ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ తరుపున రాష్ట్ర మంతటా పర్యటించి తన కొడుకు జగన్ ను గెలిపించాలని పదే పదే ప్రజలను కోరారు.
షర్మిలకు మద్దతుగా...
అదే సమయంలో తన కుమార్తె వైఎస్ షర్మిల కూడా రాజకీయాల్లోకి రావాలని తపించారు. తండ్రి ఆశయాలను కొనసాగించడానికే ఆమె రాజకీయ పంథాను ఎంచుకున్నారు. అయితే ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దానికి కారణాలు మాత్రం బయటకు రాకపోయినా అన్నా, చెల్లెళ్ల మధ్య గ్యాప్ చాలానే ఉందన్నది ఎవరూ కాదనలేరు. సరే.. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు వైఎస్ విజయమ్మ తల్లిగా ఆమె వెంట తిరిగారు. కొంత మద్దతిచ్చారు. తెలంగాణలో తన కొడుకు జగన్ కు సంబంధించిన పార్టీ లేకపోవడంతో ఆమెకు పెద్దగా కష్టమని పించలేదు. అందుకే షర్మిలకు అవుట్ రైట్ గా మద్దతిచ్చారు. ఆమె సభలకు హాజరయ్యారు. విజయం సాధించాలని ఆశీర్వదించారు. కానీ చివరకు వైఎస్ షర్మిల పోటీ చేయకుండా పక్కకు తప్పుకున్నారు. అది వేరే విషయం.
ఈరోజు పరిస్థితి...?
కానీ ఈరోజు మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు. ఆమెను ఏపీ కాంగ్రెస్ లో ముఖ్యమైన పదవికి ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఏపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల తన అన్న జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరికి సర్ది చెబతారు? ఇద్దరూ ఎవరి పంథాలో వారున్నారు. ఈ విషయమై చర్చించేందుకే జగన్ లోటస్ పాండ్ కు రెండేళ్ల తర్వాత వచ్చి వైఎస్ విజయమ్మను కలిశారంటున్నారు. కానీ తల్లిగా ఆమె ఏం చేయగలదు. ఇద్దరికీ సర్దుకు పోవాలని చెప్పి చూస్తుందే కానీ.. ఎవరిపైనా వత్తిడి తెచ్చే శక్తి, సామర్థ్యమూ ఆమెకు లేవు. మరి విజయమ్మ ఈ పరిస్థితి రాజకీయాల్లో ఏ తల్లికీ రాలేదనే భావించాలి. ఆమె మనోవేదన ఇప్పటికయితే ముగిసిపోదు. అందుకే వైఎస్ విజయమ్మ ఇద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది.
Next Story