Fri Nov 22 2024 14:12:38 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఐదో లిస్ట్ రెడీ...బెదిరింపులకు దిగితే పనవుతుందా.. అలా అయితే అసలుకే మోసం వస్తుందా?
ఐదో లిస్ట్పైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కసరత్తులు దాదాపుగా పూర్తయింది
ఐదో లిస్ట్పైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కసరత్తులు దాదాపుగా పూర్తయింది. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. ఇప్పటికే యాభై మంది ఎమ్మెల్యేలు, పది మంది పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన అధినాయకత్వం మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. మార్పులు చేసే ముందు సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుని నేతలు చర్చిస్తున్నారు.
అన్నీ వివరాలు చెబుతూ...
ఏ పరిస్థితుల్లో తాము సీట్లు ఛేంజ్ చేస్తున్నామని చెబుతున్నారు. ఛేంజ్ చేసిన చోట అనుకూలంగా ఉండే పరిస్థితులు, ప్రస్తుతమున్న నియోజకవర్గంలో అననుకూల పరిస్థితులను వారికి వివరించి అక్కడే సంతృప్తి పడేలా చేస్తున్నారు. కొందరికి మాత్రం సీట్లు ఛేంజ్ కాకుండా పూర్తిగా పక్కన పెడుతున్నామని చెబుతన్నారు. వారికి మాత్రం ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇది జగన్ హామీ అని కూడా వారు నమ్మకంగా చెబుతున్నారు. కొత్త వారికి సహకరించాలని నచ్చచెబుతున్నారు అలా చేస్తే రాజకీయ భవిష్యత్ ఉంటుందని కూడా ప్రత్యేకించి వారు చెబుతున్నారు.
టిక్కెట్ దక్కని నేతలు...
అయితే టిక్కెట్ దక్కని నేతలు మాత్రం నియోజకవర్గాలకు వెళ్లి వారి వర్గంతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. కొంత మేర అసంతృప్తులు బయటపడుతున్నా సర్దుకుపోయేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు మాత్రం అనుచరులకు సర్దిచెప్పలేక సతమతమవుతున్నారు. హైకమాండ్ ను థిక్కరించి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చెప్పాలంటూ వారికే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. కనిగిరి నియోజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కు టిక్కెట్ ఇవ్వకపోవడంతో నిరసనగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు రాజీనామా బాట పట్టారు. వారిని సముదాయించడానికి తల ప్రాణం తోకకు వస్తుంది.
ఈరోజు క్యాంప్ కార్యాలయానికి...
బెదిరింపులకు దిగితే ఫ్యాన్ పార్టీ అధినేత వద్దని కుదరదని తెలుసు. అలాగని ఐదేళ్ల పాటు తాము నియోజకవర్గానికి దూరంగా ఉండలేమని కొందరు మానసిక వేదన చెందుతున్నారు. ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బనగానపల్లి ఎమ్మెల్యే కాటసారి రామిరెడ్డి వచ్చారు. అలాగే మంగళగిరి నియోజకర్గం నేతలు గంజి చిరజీవి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమరనాధ్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లు ఉన్నారు. మద్ది శెట్టి వేణుగోపాల్, కాసు మహేశ్ రెడ్డి కూడా వచ్చారు. మరి ఐదో లిస్ట్ లో ఎవరి పేరు ఉంటుందో? ఎవరి పేరు ఉండదోనన్న భయంతో వైసీపీ నేతలున్నారు.
Next Story