Fri Nov 22 2024 20:23:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు వేసిన వైసీపీ అభ్యర్థులు
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా.. నామినేషన్లు వేసే..
అమరావతి : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలను భర్తీ చేస్తూ.. ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏపీలో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురు అభ్యర్థుల పేర్లను ఇటీవలే ప్రకటించింది అధిష్టానం. ఆ నలుగురూ నేడు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డికి ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు వరుసగా వి.విజయ సాయిరెడ్డి,బీద మస్తాన్ రావు,ఎస్.నిరంజన్ రెడ్డి , ఆర్ కృష్ణయ్య నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నలుగురి నామినేషన్ పత్రాలతో పాటు వైఎస్సార్సీపీ నుంచి పొందిన బి ఫార్మ్, అఫిడవిట్, సెక్యురిటీ డిపాజిట్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా.. నామినేషన్లు వేసే అభ్యర్థుల వెనుక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు, శాసన సభ్యులు వచ్చారు. తొలిగా వి.విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా.. ఆయన వెనుక ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ,పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ (ప్రజావ్యవహారాల) సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
తదుపరి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి బీద మస్తాన్ రావు తో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా షేక్ బిపారి, మంత్రులు బొత్స సత్యనారాయణ,పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేరుగు నాగార్జున హాజరయ్యారు. మూడో అభ్యర్థి ఎస్.నిరంజన్ రెడ్డి తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు హాజరయ్యారు. నాలుగో అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరియు మేరుగు నాగార్జున హాజరయ్యారు. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. వైసీపీ అధిష్టానం ఈసారి ఇద్దరు బీసీ నాయకులను, మరో ఇద్దరిని ఓసీ కేటగిరి నుంచి ఎంపిక చేసింది.
Next Story