Fri Nov 22 2024 20:06:07 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వైఎస్ షర్మిల అడుగులు హస్తిన వైపు... విలీనానికే మొగ్గు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని డిసైడ్ అయ్యారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని డిసైడ్ అయ్యారు. బుధవారం లేదా గురువారం షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ లో విలీనం చేయడానికే షర్మిల మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ఆమె ముఖ్యనేతలకు సంకేతాలు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లో అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ భేటీలో షర్మిల కాంగ్రెస్ లో విలీనంపై ఆమె క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని ఆమె చెప్పినట్లు సమాచారం.
తాత్కాలికంగా...
గత కొంతకాలంగా వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల సమయంలోనే విలీన ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో సోనియా, రాహుల్ ను కూడా కలసి వచ్చారు. విలీనం మాత్రం తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకోసం వైఎస్సార్టీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న ప్రచారం అప్పట్లోనే జరిగింది. కానీ ఎందుకో విలీన ప్రక్రియ మాత్రం జరగలేదు.
మరోసారి విలీనానికి...
అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి విలీన ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఢిల్లీ నుంచి మరోసారి సిగ్నల్స్ రావడంతో వైఎస్ షర్మిల హస్తినకు బయలుదేరి వెళుతున్నారని చెప్పారు. బుధ లేదా గురువారంలో ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ షర్మిల అక్కడే అగ్రనేతల సమక్షంలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తారని కూడా చెబుతున్నారు. విలీనం చేసిన తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన భవిష్యత్ ప్రణాళికను కూడా ఆమె వివరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఏపీ ఎన్నికల కోసమే...
కానీ వైఎస్ షర్మిలను కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసమే కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీలో చేర్చుకున్నట్లు చెబుతున్నారు. ఆమెను స్టార్ క్యాంపెయినర్ గా పెట్టి ఏడు గ్యారంటీలను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతో పార్టీ హైకమాండ్ ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఏపీలో కాంగ్రెస్ అనుకున్న తీరులో స్థానాలను సంపాదించలేకపోయినా సరే.. వైఎస్ షర్మిలకు మాత్రం కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి ఇస్తామన్న హామీని కాంగ్రెస్ అగ్రనేతలు ఇస్తున్నారని తెలిసింది. ఈరోజు జరిగిన వైఎస్సార్టీపీ సమావేశంలో విలీనం చేస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో ఇక ఆమె ఏపీలో ఏరకమైన పాత్ర పోషిస్తారన్న అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Next Story