Fri Nov 22 2024 19:50:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : షర్మిలది అతి విశ్వాసంలా అనిపించడం లేదా.. అంత సీన్ లేదంటున్న ఎనలిస్టులు
వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది
"తోచీ తోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్లిందట" ఈ సామెత సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై వైరల్ అవుతుంది. అయితే ఈ సామెత షర్మిలకు ఎంత వరకూ వర్తిస్తుందన్నది పక్కన పెడితే ఆమె అతి విశ్వాసానికి పోయి ఉన్న ఇమేజ్ కాస్తా పోగొట్టుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగానే కనిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల మాట తీరును చూస్తుంటేనే అది అర్థమవుతుంది. తనవల్లనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పడం అతిశయోక్తిగానే కాదు ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. తాను పోటీ చేయకపోవడం వల్ల తెలంగాణలో 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పడం హాస్యాస్పదంగానే చూడాల్సి ఉంటుంది.
తెలంగాణలో పార్టీ పెట్టి...
వైఎస్ షర్మిల అసలు తెలంగాణలో పార్టీ పెట్టడమే పెద్ద తప్పు. సీమాంధ్రకు చెందిన నేతగా తెలంగాణలో పార్టీ పెట్టి ఏం చేస్తారని ఆమె వైఎస్సార్టీపీని పెట్టినప్పుడే అందరూ వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ మద్దతుదారులతో పాటు జగన్ సైన్యం అండగా ఉంటుందని భావించారు. మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. చివరకు తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ను ఓడించడానికి అంటూనే కాంగ్రెస్ ను గెలిపించడానికి తన పార్టీ ఎన్నికలలో పోటీ చేయలేదని చెప్పి పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు చాలా మంది బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు.
లోటస్ పాండ్ వైపు కూడా...
ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల వెంట ఉంది అతి కొద్ది మంది మాత్రమే. వారిలోనూ పేరున్న నేతలు ఎవరూ లేరు. తెలంగాణ కాంగ్రెస్ కూడా షర్మిలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె కూడా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభినందనలు తెలిపి ఊరుకున్నారు తప్పించి ఎవరినీ కలిసే ప్రయత్నం చేయలేదు. చివరకు షర్మిలను కూడా కాంగ్రెస్ లో ఉన్న నేతలు, గెలిచి మంత్రులుగా ఉన్న వారు కూడా కలవలేదు. అదీ షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్టు అని చెప్పకతప్పదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో దాదాపు షర్మిల తండ్రి కేబినెట్ లో పనిచేసిన మంత్రులే అధికంగా ఉన్నారు. వైఎస్ రాజకీయ బిక్ష పెట్టిన వారు కూడా లోటస్ పాండ్ వైపు చూడలేదంటే పరిస్థితిని వేరే చెప్పనక్కర లేదు. ఇక ఇదే సమయంలో ఈరోజు వైఎస్ షర్మిల ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికే ఆమె ఢిల్లీకి వెళుతున్నారు. కాంగ్రెస్ లో చేరనున్నారు. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు.
నష్టమంటూ జరిగితే...
షర్మిల చేరితే కాంగ్రెస్ కు వచ్చేది లేదు. పోయేది లేదు. నష్టం అంటూ జరిగితే అది షర్మిలకే తప్ప కాంగ్రెస్ కు కొత్తగా జరిగే నష్టమంటూ ఏదీ ఉండదు. అయితే అన్న జగన్ కూడా ఇవ్వని ప్రాధాన్యత కాంగ్రెస్ నేతలు ఇస్తారంటే ఎలా నమ్ముతావామ్మా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిలను ఆ పార్టీ తరుపున ప్రచారానికి దించితే అక్కడ పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. ఏపీలోనూ ఉన్న ఇమేజ్ కూడా పోయే అవకాశాలున్నాయి. ఏదైనా గుప్పటి మూసేంత వరకే.. తెరిచి చూస్తే... అన్న తరహాలో ఇప్పడు షర్మిల ఏపీలో అడుగు పెట్టి తన పేరుతో పాటు తండ్రి వైఎస్ పేరును బద్నాం చేయడం ఎందుకన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏపీలో ఏం చేయాలనుకుంటున్నారు? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఏం చెబుతారు?
ఇంతకూ ఏపీలోకి వెళ్లి వైఎస్ షర్మిల ఏం చెబుతారు? వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరు మార్చి మళ్లీ రాజీవ్ ఆరోగ్యశ్రీ గా పెట్టమంటారా? వైఎస్సార్ ఆసరా పింఛన్లు తీసి సోనియా పించన్లు తీసుకు వస్తామని చెబుతారా? వైఎస్సార్ కల్యాణమస్తు పథకానికి ప్రత్యామ్నాయంగా మరో పేరు పెట్టమంటారా? వైఎస్ కుమారుడు జగన్ పరిపాలన బాగా లేదని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తే రాజన్న రాజ్యాన్ని తెస్తామని చెబుతారా? ఇవన్నీ వైఎస్ అభిమానుల నుంచి షర్మిలకు దూసుకొస్తున్న ప్రశ్నలు. నిర్ణయం తీసుకున్నంత తేలికైన విషయం కాదు.. ప్రజలను మెప్పించడం.. నమ్మించడం. అందుకే షర్మిల మరోసారి రాంగ్ స్టెప్ వేస్తున్నారన్న వ్యాఖ్యలే ఎక్కువగా రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో నాటకీయత ఉండదు. అంతా వాస్తవరూపంలోనే ఉంటుంది. షర్మిలను ఏపీ ప్రజలు ఎలా చూస్తారన్నది భవిష్యత్ లో తేలనుంది.
Next Story