Mon Dec 23 2024 02:47:12 GMT+0000 (Coordinated Universal Time)
ఎలాన్ మస్క్ కు.. సోషల్ మీడియా ప్రపంచానికి షాకివ్వబోతున్న జాక్ డోర్సే
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశాక ఎన్నో విషయాలు.. త్వరత్వరగా జరిగిపోతూ ఉన్నాయి. ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్‌లను తొలగించారు. 'విస్తృతంగా విభిన్న దృక్కోణాలతో ట్విటర్ ఓ కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఆ కౌన్సిల్ ఏర్పాటు అయ్యేవరకు ట్విటర్లో కంటెంట్ నియంత్రణ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం గానీ, అకౌంట్లను పునరుద్ధరణ జరగవు' అని మస్క్ చెబుతూ వస్తున్నారు.
ఎలాన్ మస్క్ టేకోవర్ పట్ల అసంతృప్తిగా ఉన్న వాళ్లు ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఈ సమయంలో ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కొత్త సోషల్ నెట్వర్కింగ్ సేవను అన్వేషిస్తున్నారని పీపుల్ మ్యాగజైన్ పేర్కొంది. మస్క్ సంస్థ నియంత్రణను స్వీకరించడానికి సరిగ్గా ఒక వారం ముందు, డోర్సే తన వికేంద్రీకృత సామాజిక ప్లాట్‌ఫారమ్ బ్లూస్కీ కోసం బీటా టెస్టర్ల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. బ్లూస్కీని 2019లో స్థాపించారు. నవంబర్ 2021లో, డోర్సే ట్విట్టర్ CEO పదవికి రాజీనామా చేశాడు. మే 2022లో, అతను డైరెక్టర్ల బోర్డు నుండి రాజీనామా చేశాడు. దీంతో డోర్సే తన కాన్సెన్ట్రేషన్ మొత్తం బ్లూస్కీ మీద పెట్టాడని అంటున్నారు. కొత్త సోషల్ మీడియా సైట్ కు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రైవేట్ బీటాలో ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. బీటా వెర్షన్ పరీక్ష చేసి.. ఎలా పని చేస్తుందనే దాని గురించి వివరాలను పంచుకుంటామని డోర్సే టీమ్ తెలిపింది. కొత్త యాప్ ఫెడరేటెడ్ సోషల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటుంది, ఇక్కడ అనేక సైట్లు కలిసి సేవలను అందించేలా ఉంటాయి, దీనిని ప్రామాణీకరించిన బదిలీ ప్రోటోకాల్ (AT ప్రోటోకాల్) అని పిలుస్తారు.
Next Story