బాబును పోసాని ఇంత మాట అంటారా?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ అవసరం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి తెచ్చుకోనన్ని స్టేలు చంద్రబాబు తెచ్చుకున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకోవడం పట్ల చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. 23 మందిని సిగ్గులేకుండా కోనుగోలు చేశారని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని విజయవాడకు పారిపోయానని ఆరోపించారు. జగన్ ను అణగదొక్కడానికి చంద్రబాబు ప్కయత్నిస్తున్నారని, పవన్ కళ్యాణ్ ను అవసరానికి వాడుకుని, ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడన్నారు. కుల రాజకీయాలు, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. వైఎస్ జగన్ లో స్పష్టత ఉందని, తన ఓటు జగన్ కే నని స్పష్టం చేశారు. అవసరం తీరిన తర్వాత వదిలేయడం చంద్రబాబుకు అలవాటేనని, గతంలో ఎన్టీఆర్ ను ఓడిస్తానని అనలేదా, ఓడిపోగానే గోడ దూకి టీడీపీలో చేరలేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దని ఇన్నిరోజులు చెప్పి ఇప్పుడు మాట మార్చాడన్నారు.
పోసానిని హైదరాబాద్ లో తిరగనివ్వం....
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో తిరగనివ్వమని తెలుగుతమ్ముళ్లు హెచ్చరించారు. పోసాని మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నడని, ఆయన వైసీపీ, బీజేపీకి ఏజెంట్ అని విమర్శించారు. పోసాని ప్రెస్ మీట్ ను అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కి రాగా, అప్పటికే పోసాని ప్రెస్ మీట్ ముగించుకుని వెళ్లిపోయారు. పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.