Sun Dec 22 2024 17:18:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫుడ్ డెలివరీ ఏజెంట్ల కష్టాలు.. ఈ వీడియో చూసి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
కొందరు ఎంతో నిజాయితీగా పనిచేస్తే..మరికొందరు మాత్రం కస్టమర్లకు డెలివరీ చేయాల్సిన ఫుడ్ లో కొంచెం తినేసి ఇస్తుంటారు..
ఫుడ్ డెలివరీ ఏజెంట్లు.. చదువు లేనివారే కాదు.. పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వారు, సాఫ్ట్ వేర్లు, ఎంబీఏలు చేసిన గ్రాడ్యుయేట్లు కూడా ఇప్పుడు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కారణం.. కుటుంబాన్ని పోషించుకోవడానికి సరైన ఉద్యోగం రాకపోవడం, లేకపోవడమే. ఎండైనా, వానైనా.. ఒకసారి డెలివరీ యాక్సెప్ట్ చేశాక అది చేసి తీరాల్సిందే. మధ్య ఏ కారణంచేతనైనా డెలివరీ ఆగిందా.. ఇక అంతే సంగతులు. అటు కస్టమర్, ఇటు సంస్థ నుంచి వచ్చే ఒత్తిడి అంతా ఇంతా కాదు.
కొందరు ఎంతో నిజాయితీగా పనిచేస్తే..మరికొందరు మాత్రం కస్టమర్లకు డెలివరీ చేయాల్సిన ఫుడ్ లో కొంచెం తినేసి ఇస్తుంటారు. గతంలో అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి వీడియోనే మరొకటి బయటికొచ్చింది. అయితే.. ఈ వీడియోలో డెలివరీ ఏజెంట్ కస్టమర్ కు ఇవ్వాల్సిన ఫుడ్ తింటున్నట్లు కనిపించడం లేదు. అతను తన డ్యూటీని కొనసాగించేందుకు రోడ్డుపక్కన ఆగి.. తన ఆకలిని తీర్చుకునేందుకు ఆగమేఘాల మీద ఒక ప్లాస్టిక్ కవర్ లో ఉన్న ఫుడ్ ను గబగబా తింటున్నాడు. జూన్ 27న ట్విట్టర్ లో షేర్ చేయబడిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. వీడియో షేర్ చేసిన వ్యక్తి.. 2009 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్. ఈ కాలంలో వాళ్లు కూడా తమ ఆరోగ్యాన్ని చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
అవనీష్ చేసిన వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఒకరి పర్మిషన్ లేకుండా అతని వ్యక్తిగత వీడియోను షేర్ చేయడం సబబు కాదని ఒకరంటే.. మరొకరు ఈ విషయం అందరికీ తెలియాల్సిన విషయం అని, అదే నిజమని పేర్కొన్నారు. డెలివరీ ఏజెంట్ల వృత్తి కూడా కష్టతరమైనదని అందరికీ తెలియాలని కామెంట్ చేశారు. మరొక నెటిజన్.. ఫుడ్ ఆర్డర్ చేసినపుడు డెలివరీ ఏజెంట్లకు కనీసం రూ.20 అయినా చెల్లిస్తే.. అది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఒక నెటిజన్ అయితే.. దయచేసి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయొద్దని కోరాడు. అతను ఎవరికీ కనిపించకుండా తింటుంటే.. మీరు దానిని ఇలా పోస్ట్ చేయడం బాలేదు. మీకు అంతగా కావాలంటే అతనికి సహాయం చేయండి అంతే కానీ.. సానుభూతి కోసం వీడియోలు పోస్ట్ చేసి వారు దాచుకున్నది అందరికీ చూపించకండి అని కోరాడు. ఆ డెలివరీ ఏజెంట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Next Story