Mon Dec 23 2024 11:55:17 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభకు ఆ నలుగురు వీళ్లేనా?
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీలో ఎవరికి దక్కుతాయన్న చర్చ జరుగుతుంది. బలాన్ని బట్టి 4 స్థానాలు వైసీపీకే దక్కుతాయి
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయన్న చర్చ జరుగుతుంది. బలాన్ని బట్టి నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అయితే ఇప్పటికే జగన్ నాలుగు పేర్లను ఖరారు చేసినట్లు వైసీపీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా జగన్ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.
సాయిరెడ్డికి రెన్యువల్....
విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్ స్థానాలు త్వరలో ఖాళీ అవుతున్నాయి. విజయసాయిరెడ్డికి మరోసారి జగన్ రెన్యువల్ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఢిల్లీలో ఆయన లాబీయింగ్ అవసరం కావడంతో విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ పదవి దక్కనుంది. విజయసాయిరెడ్డి విషయంలో జగన్ కూడా పెద్దగా ఆలోచించాల్సిన పనిలేకుండా ఆ పేరుపై టిక్ పెడతారు.
మర్రికి హామీ....
ఇక మరో పదవి మర్రి రాజశేఖర్ కు దక్కుతుందంటున్నారు. మర్రి రాజశేఖర్ కు ఎప్పుడో పదవి దక్కాల్సి ఉంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించారు. కానీ మర్రిని రాజ్యసభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని మర్రి రాజశేఖర్ కు కూడా తెలిపినట్లు సమాచారం. కమ్మ సామాజికవర్గం కోటాలో రాజశేఖర్ కు ఈ పదవి దక్కనుంది. ఒక రెడ్డి, ఒక కమ్మలకు రెండు పదవులు పోగా మిగిలిన స్థానాలపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
ఆలీకి ఛాన్స్....
మైనారిటీ కోటా కింద సినీ నటుడు ఆలీకి జగన్ రాజ్యసభ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఆలీకి ఇప్పటికే జగన్ పదవిపై హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా మైనారిటీలకు ఇప్పటికే శానసమండలిలో జగన్ అవకాశమిచ్చారు. అందుకే ఆలీని రాజ్యసభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారంటున్నారు. ఇక నాలుగో స్థానాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి కిల్లి కృపారాణి పేరు వినపడుతుంది. అయితే ఎస్సీలకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఆమెకు ఈసారి ఛాన్స్ దక్కే అవకాశాలు లేవు. మరోకోణంలో రాజ్యసభ పదవి మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా దక్కే అవకాశాలున్నాయి. గౌతమ్ రెడ్డి మరణంతో ఆ కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకోకుంటే మేకపాటికి రాజ్యసభ దక్కే అవకాశముంది.
Next Story