Mon Dec 23 2024 02:50:36 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభ .. ఇక బీజేపీదే హవా
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కు వంద సభ్యుల బలం రాజ్యసభలో ఉండేది. ప్రస్తుతం ఆ బలానికి బీజేపీ చేరుకుంది.
2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ క్రమంగా తన బలం పెంచుకుంటుంది. అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే దిశగా బీజేపీ చేసిన ప్రయత్నాలు కొంత సక్సెస్ అయ్యాయి. సాధారణ ఎన్నికల్లో లోక్ సభలో బలం పెంచుకుంటూ వస్తున్న బీజేపీ తాజాగా పెద్దల సభలో దాని బలం వందకు చేరుకుంది. కాంగ్రెస్ క్రమేణా అన్ని రాష్ట్రాల్లో కనుమరుగవుతుండటం బీజేపీకి కలసి వచ్చిందనే చెప్పాలి.
మూడు దశాబ్దాల క్రితం....
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కు వంద సభ్యుల బలం రాజ్యసభలో ఉండేది. ప్రస్తుతం ఆ బలానికి బీజేపీ చేరుకుంది. బీజేపీ రాజ్యసభలో తొలిసారి వంద స్థానాలకు చేరుకుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని బలం రాజ్యసభలో కేవలం 55 మాత్రమే. ఇక అప్పటి నుంచి వరసగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుండటంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతూ వస్తుంది. ఇతర పార్టీలు, మిత్రపక్షాల మీద కీలక బిల్లుల విషయంలో బీజేపీ ఆధారపడాల్సి వచ్చేది.
అతి పెద్ద పార్టీగా....
245 స్థానాలున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి వంద స్థానాలు దక్కాయి. విపక్ష కాంగ్రెస్ పార్టీకి 29 స్థానాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు 13, డీఎంకే 10 స్థానాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే త్వరలోమరో 52 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో బీజేపీ బలం పెద్దగా లేకపోవడంతో వంద స్థానాల నుంచి బీజేపీ పడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కానీ బీజేపీకి రాజ్యసభ లో రోజురోజకూ బలం పెంచుకుంటూ తనకు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటోంది.
- Tags
- rajyasabha
- bjp
Next Story