Bhogi Special: డూ..డూ..బసవన్నల నృత్యాలు...గంగిరెద్దుల విన్యాసాలు
Bhogi Special: డూ..డూ..బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళ..
► హరిదాసులు చేసే గజ్జెల చప్పుళ్లు
► హాస్యన్ని పండించే పగటి వేశగాళ్లు
► గాలిపటాల సందడి
► మా ఇంటికి రండి అని స్వాగతించే గొబ్బెమ్మలు
► తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
Bhogi Special: డూ..డూ..బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళు, హంగామాతో హాస్యన్ని పండించే పగటి వేషగాళ్ళు, మా ఇంటికి రండీ అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు.. గాలి పటాలతో సందడి, ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులకు పెట్టింది పేరు. అంతేకాదు అందమైన ఆనంద సంక్రాంతిలో బొమ్మలకొలువుకు ప్రత్యేక స్థానముంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా చిన్నా పెద్ద తేడా లేకుండా సంతోషంగా పండగను జరుపుకొంటారు.
తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్ని అంటిన సంబరాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం, అందరూ బావుండాలి.. అంతా మంచే జరగాలి అనే ఆశతో భవిష్యత్తుకు బాటలు పరిచేశాం.. గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణక్షణం భయంతో గడిపిన రైతన్న చల్లగా, చల్లని గాలుల మధ్య, ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. పరవళ్ళు తొక్కిన నదులు, సంద్రాలు, కాలువల సాక్షిగా, తన చమట జల్లుని చిందించి నేల తల్లిని పులకరింప చేసి పండిన పంటను చూసి పండుగకు సిద్దమయ్యాడు. సంక్రాంతి పండుగకి నిజమైన శోభ తెచ్చేది బొమ్మలకొలువు. ముంగిట ముగ్గులు హరిదాసు కీర్తనలు, బసవన్నల హడావుడి మాత్రమే కాదు బొమ్మల కొలువుకు కూడా ప్రత్యేక స్థానముంది సంక్రాంతి పండుగలో. బొమ్మ అంటే బ్రహ్మ. బ్రహ్మ నుంచి చీమ వరకు అన్నింటిలో భగవంతుడిని దర్శించవచ్చన్న భావనతో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.
సంక్రాంతి బొమ్మలు:
సంక్రాంతికి బొమ్మలను అందంగా అమర్చడం లో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు మహిళలు. బొమ్మలకొలువు అమర్చడం… పండుగకు నాలుగైదు రోజులు ముందుగానే ప్రారంభమవుతుంది. పండుగ మూడు రోజులూ అందరినీ పిలిచి పేరంటాన్ని ఎంతో వేడుకగా చేస్తారు. ఈ బొమ్మలకొలువుకి బొమ్మల్ని వరసగా పేర్చుకుంటూ వెళ్లడం కాకుండా, ఒక పద్ధతిలో అందంగా అమర్చడం నిజంగా గొప్ప కళ.
కొండపల్లి బొమ్మలు:
త్రిమూర్తులు, రామలక్ష్మణులు, పంచపాండవులు, షట్చక్రవర్తులు, సప్త ఋషులు, అష్టలక్ష్ములు, నవగ్రహాలు, దశావతారాలు...ఇలా అంకెల వరుసలో బొమ్మలను అమరుస్తారు కొందరు. ఈ బొమ్మలకొలువులో ముఖ్యంగా పెళ్లి తంతు బొమ్మలు, ముచ్చటైన కొండపల్లి బొమ్మలు, మట్టిబొమ్మలను కూడా ఉంచుతారు. కొందరు ప్రాంతాలను బట్టి, ఆచారాలను బట్టి బొమ్మలను అమరుస్తారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. బొమ్మల్ని అమర్చి పేరంటం చేసి తాంబూలము, దక్షిణ ఇస్తే ఆ బొమ్మల రూపాల్లో ఉన్న దేవతలు తమకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారని మన పెద్దల నమ్మకం. ఇలాంటి సాంప్రదాలయతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో వైభవంగా జరుపుకొంటారు.