Sat Jan 11 2025 06:09:00 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రోడ్లన్నీ ఖాళీ.. సంక్రాంతికి ఊరెళ్లిన జనం.. ట్రాఫిక్ ఫ్రీ
సంక్రాంతికి హైదరాబాద్ ఖాళీ అవుతోంది. నగర జనం సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్ లో రహదారులు ఖాళీగానే దర్శనమిస్తున్నారు
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ ఖాళీ అవుతోంది. సంక్రాంతి సెలవులకు నగర జనం సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్ లో రహదారులు ఖాళీగానే దర్శనమిస్తున్నారు. వరసగా సెలవులు రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పెద్ద పండగ కావడంతో సొంతూళ్లకు వివిధ మార్గాల ద్వారా పయనమయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఉదయం నుంచే జనంతో కిటకిటలాడుతున్నాయి. నగరం ఖాళీ అవుతుండటంతో ట్రాఫిక్ రద్దీ కూడా తక్కువగా ఉంది. దీంతో వాహనాలు సులువుగా బయలుదేరి వెళుతున్నాయి.
సొంతూళ్లకు వెళ్లడంతో...
పండగకు సొంత ఊళ్లకు ప్రజలు ప్రయాణం కావడంతో కూకట్ పల్లిలో ప్రయాణికులతో బస్టాప్ లు కిక్కిరిసిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్ పల్లి మాత్రమే కాదు అన్ని బస్టాండ్లలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది వరస సెలవులు రావడంతో అత్యధిక మంది జనం సంక్రాంతికి సొంతూళ్లకు బయలుదేరడంతో నగరం ఖాళీ అయినట్లే కనిపిస్తుంది. ప్రధానంగా కూకట్ పల్లి, ఎల్. బి.నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ సంక్రాంతి సెలవులతో బోసిపోయి కనిపిస్తుంది.
ఏపికి చెందిన వారు...
హైదరాబాద్ నగరంలో దాదాపు యాభై శాతం మంది ఏపికి చెందిన వారు కూడా ఉండటంతో వారిలో 90 శాతం మంది సంక్రాంతి పండగకు సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. అదే సమయంలో తెలంగాణ వాసులు కూడా పండగ జరుపుకోవడానికి తమ సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లడంతో నగరం ఖాళీ అయినట్లు కనిపిస్తుంది. నిత్యం రద్దీగా కనిపించే హైదరాబాద్ రహదారులు వాహనాలు లేకపోవడంతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ప్రతి సంక్రాంతికి ఇదే తరహాలో హైదరాబాద్ కనిపిస్తుంది. తిరిగి 17వ తేదీ నుంచి హైదరాబాద్ లో రద్దీ మొదలవుతుంది.
Next Story